వేడుకలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈక్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిద్దాం….....           (30-Jun-2020)


మళ్ళీ పెళ్ళిళ్ళ హడావుడి మొదలైంది……

 

వేడుకలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈక్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిద్దాం….

 

భోజనాల బల్లలపై కాగితం మాత్రమే పరచాలి. ప్లాస్టిక్ కాగితం వేయకూడదు.

 

మంచినీళ్ళ గ్లాసులు, టీ కప్పులు స్టీల్ వి కాని, గాజువి కాని, పేపర్ తో చేసినవి కాని మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు వాడకూడదు.

 

ప్లాస్టిక్ విస్తర్లు, ప్లాస్టిక్ కోటింగ్ విస్తర్లు, తగరం విస్తర్లు, ప్లాస్టిక్ అరిటాకులు, థర్మోకోల్ ప్లేట్లు వాడకూడదు.అరటి ఆకులు గానీ, ఆకులతో కుట్టిన విస్తర్లు వంటి భూమిలో కలిసేవాటినే వాడాలి.

 

బఫే భోజనానికి ప్లాస్టిక్ ప్లేటులు కాని, పింగాణి ప్లేటులు కాని, వక్క ఆకుతో చేసిన ప్లేటులు (ఇవి భూమిలో కలిసిపోతాయి) వాడుకోవాలి.

 

ఐస్ క్రీం కప్పులు ప్లాస్టిక్ వి కాకుండా పేపర్ కప్పుడు, ఐస్ క్రీమ్ తినడానికి ఉపయోగించే చెంచాలు కూడా ప్లాస్టిక్ కాకుండా చెక్కతో చేసిన చెంచాలే వాడాలి.

 

పన్నుపుల్లలు కూడా ప్లాస్టిక్ వాటికి బదులు చెక్కవే వాడాలి.

 

ప్రేమ కొద్దీ కొసరికొసరి వడ్డించటం, బలవంతంగా తినిపించడం మన సంస్కృతి. దీనివలన ఆహారం చాలా వ్యర్థం అవుతుంటుంది. ఆహారాన్ని అవసరమైనంత మాత్రమే వడ్డించడం, తినగలిగినంత మాత్రమే పెట్టించుకోవడం ద్వారా ఆహార పదార్థాలు వ్యర్థం కాకుండా నిరోధించవచ్చు.

 

చేతులు కడుక్కోవడానికి త్రాగునీరైన RO నీరు గాని, బాటిల్ వాటర్ కాని కాకుండా మామూలు కుళాయి నీళ్ళను మాత్రమే వాడాలి.

 

చేతులు కడిగే ప్రదేశంలో తగినన్ని చెత్తబుట్టలు ఏర్పాటు చేస్తే కిళ్ళీల కాగితాలు, పేపర్ నేప్ కిన్స్ వేస్తారు.
బహుమతులు ఇచ్చేందుకు ప్లాస్టిక్ సంచులకు బదులు నార, గుడ్డ సంచులను వాడాలి.

 

తరిగిన కూరల తుక్కును, మిగిలిపోయిన ఆహారాన్ని, కార్యక్రమంలో వచ్చిన చెత్తనంతా రోడ్డు ప్రక్కన వేయక, పంచాయతీ లేక మునిసిపాలిటీ వారు నిర్దేశించిన చోట్లనే వేయాలి.

 

ఒక్కరోజుకి మాత్రమే ఉపయోగపడే ఫ్లెక్సీ బ్యానర్లు వాడవద్దు. గుడ్డ బ్యానర్లు మాత్రమే వాడదాం.
కార్యక్రమాలలో రోడ్ల వెంబడి బాణాసంచా కాల్చడం వలన రోడ్ల పైన కాగితం ముక్కలు, చెత్త పేరుకుంటాయి. కనుక బాణాసంచా కాల్చవలసి వస్తే ఒక ప్రత్యేకమైన స్థలంలో కాల్చి ఆ చెత్తను ఎత్తి డంపింగ్ యార్డుకి చేర్చే బాధ్యతను నిర్వాహకులే తీసుకోవాలి.

 

పరిసరాల పరిశుభ్రత :

భోజనాలు చేసే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం అవసరం. మనం భోజనాలకు కూర్చొనేటప్పటికి నేల మీద ఆహార పదార్ధాలు పడి తడిగా, రొచ్చుగా ఉంటే, మర్యాద కోసం తినడం తప్ప, నిజంగా భోంచేయాలని అనిపించదు. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రం చేసే మనుష్యులను నియమించి, వారిపై అజమాయిషీ చేయడానికి ప్రత్యేకంగా ఒకరిని ఉంచాలి. (మిగతా వారు ఎవరు చెప్పినా, ఆ మనుష్యులు వినరు కనుక, వారిని నియమించిన వారే అజమాయిషీ చేయడం మంచిది). చేతులు కడిగే ప్రదేశంలో తగినన్ని చెత్త బుట్టలు ఏర్పాటు చేస్తే కిళ్ళీల కాగితాలు, పేపర్ నేప్ కిన్స్ వేస్తారు.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

01-03-2018