ఆడు మనోడా? ఆవిడ మనమ్మాయా?....           (24-Jul-2020)


గుర్తుకొస్తున్నాయి – 1

కాలేజీ కబుర్లు

 

ఆడు మనోడా? ఆవిడ మనమ్మాయా?

 

సంవత్సరం - 1999

 

స్థలం - గుంటూరు మెడికల్ కాలేజి, ప్రిన్సిపల్ రూమ్ ముందు పోర్టికో

 

సందర్భం - మన 1974 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ రీయూనియన్

 

సమయం - ఉదయం 8 గంటలు.

 

ఎంతో హోమ్ వర్క్ చేసి మా గుంటూరు మిత్రులు సిల్వర్ జూబ్లీ మీట్ ను ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ రూమ్ ముందు రిజిస్ట్రేషన్ జరుగుతోంది. కాలేజీ గేటు నుంచి మా క్లాస్ మేట్స్ వాళ్ళ Spouses తో ఒకొక్కళ్ళుగా ప్రిన్సిపల్ రూమ్ వైపుకు వస్తున్నారు. మేము దాదాపు ఐదారు మందిమి పోర్టికోలో ఉండి వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. చాలా exciting గా ఉంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత మొట్టమొదటగా చాలా మంది మిత్రులను చూడడం గదా!

 

‘మాధవరావు’ మమ్ముల్నందరినీ ఒక ప్రశ్న వేసి మరింత excite చేసేవాడు. భార్య, భర్త కాలేజీ గేటు దగ్గర నుండి వస్తున్నప్పుడు ‘అరేయ్! ఆడు మనోడా? ఆవిడ మనమ్మాయా? చెప్పుకోండి చూద్దాం’ అని అడిగేవాడు (వాళ్ళిద్దరిలో మన క్లాస్ మేట్ ఎవరు అని).

 

బట్ట తల, పెరిగిన పొట్ట, బరువు వంటి మార్పులు ఉన్నా చాలా మందిని తేలికగానే గుర్తుపట్టగలిగాం. దగ్గరకు రాగానే కేరింతలు, కౌగిలింతలు మామూలే.

 

ఈ క్రమంలో ఒక జంట దగ్గరకొస్తోంది. ‘రేయ్ చెప్పరేంట్రా వాడు మనోడా, ఆవిడ మనమ్మాయా’ అని అడుగుతూనే ఉన్నాడు మాధవరావు.

 

ఎవ్వరికీ అర్ధం కావడం లేదు వాళ్ళిద్దరిలో ఎవరు మన క్లాస్ మేటో!

 

దగ్గరకొచ్చేశారు.

 

మొహమాటంగా నవ్వాము.

 

వాళ్ళు అట్లానే నవ్వారు.

 

పేరు పెట్టి పలకరించడానికి లేదు.

 

అందరం ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ ఉన్నాం.

 

రిజిస్ట్రేషన్ లో పేరు రాసేటప్పుడు మాకర్ధమయింది ‘ఎవరు మనోళ్ళో!’

 

హమ్మయ్య అనుకున్నాం.😀

 

- డి.ఆర్.కె.
24.07.2020.