రెండు గుర్రాల మీద స్వారీ....           (25-Jul-2020)


 గుర్తుకొస్తున్నాయి...3

కాలేజీ కబుర్లు

 

రెండు గుర్రాల మీద స్వారీ...

 

రెండు గుర్రాల మీద ఒకే సారి స్వారీ చేయడం సాధ్యమేనా?

 

సినిమా హీరోలకు కూడా సాధ్యం కానీ ఈ ఫీట్ ను మా క్లాస్ మేట్ “సూర్య ప్రకాష్” చేశాడు.

 

1978 లో మా క్లాస్ మేట్స్ కొందరం కాశ్మీర్ టూర్ కు వెళ్ళాం. ‘పెహెల్ గాం’ అనే ప్రదేశంలో ఒకరోజు రాత్రి గుడారాల్లో బస చేశాం.

 

మర్నాడు ఉదయాన్నే అక్కడినుండీ 11 కి.మీ దూరంలో ఉన్న ‘చందన్ వారీ’ అనే ప్రదేశానికి బయలుదేరాం. ఇదంతా అమర్ నాధ్ యాత్ర చేసే వారి రూటు.

 

‘చందన్ వారీ’ లో సహజంగా తయారైన చిన్న ‘ICE BRIDGE’ ఉంటుంది. నడక గాని, గుర్రాలెక్కి గాని మాత్రమే అక్కడకు వెళ్ళగలం. మేం గుర్రాలెక్కి బయలుదేరాం.

 

చందన్ వారీ లో మంచు కొండల మధ్య మేం తప్ప ఎవ్వరూ లేరు. కాని ఒక సర్దార్ జీ మాత్రం ‘టీ’ అమ్ముతూ కన్పించాడు. మాటలు కలిపాం. టీ తాగాం.

 

మీరు ఎక్కడ నుంచీ వస్తున్నారు? అని అడిగాడు. గుంటూరు పేరు తెలియదేమో అని ‘విజయవాడ’ అని చెప్పాం.

 

అవునా! విజయవాడ లో మా వాళ్ళు ఉన్నారు అని పేర్లు చెప్పాడు (ఇప్పటి టిప్సీ టాప్సీ షో రూమ్ ఓనర్లకు అప్పుడు ఆటో మొబైల్ షాపు ఉండేది. వాళ్ళే అనుకున్నాం). వాళ్ళని అడిగానని చెప్పండి అన్నాడు.

 

ఎక్కడ విజయవాడ?


ఎక్కడ హిమాలయాలు?


సర్దార్జీలు ఎక్కడైనా బతికేస్తారు అనుకొన్నాం.

 

ఇంతకీ సూర్య ప్రకాష్ రెండు గుర్రాల స్వారీ సంగతి చెప్పలేదు కదా!

 

గుర్రాల జీను మీద 11 కి.మీ.లు ప్రయాణించడం మాకు కష్టం గానే ఉంది. కూర్చునే ప్రదేశం మంటగా ఉంది. కానీ ప్రకాష్ ఒక్కడే ఖుషీగా ఉన్నాడు.

 

గుర్రం మీద స్వారీ చేస్తూనే ఒక గ్లాసులో విస్కీ పోసుకొని, మంచు కొండలోని మంచును అందులో వేసుకొని సిప్ చేస్తూ “నేను ఇప్పుడు రెండు గుర్రాల మీద ఉన్నాను తెలుసా” అని తనదైన శైలిలో నవ్వాడు.

 

మందేసుకున్న వాళ్ళని గుర్రమెక్కాడురా అంటాం కదా! గుర్రం మీద మందు వేస్తూ రెండు గుర్రాల మీద ఉన్నానని ఆయన ‘చతురు’.

 

ఏ సిట్యుయేషన్ లోనైనా ఎంజాయ్ చేయగలగడం మావాడి ప్రత్యేకత!

 

- డి.ఆర్.కె
25.07.2020.