అరేయ్ నా బ్యాగ్ ఏదిరా?....           (27-Jul-2020)


 గుర్తుకొస్తున్నాయి.... 4

కాలేజీ కబుర్లు

 

మేము గుంటూరు మెడికల్ కాలేజీలో విద్యార్ధులుగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన

 

రేయ్ నా బ్యాగ్ ఏదిరా?

 

మూర్తి బ్యాగ్గు ...


దాని కధా కమా మిషు

 

MBBS చదువుతున్న కొంతమంది మిత్రులం కలిసి 1978 లో ఢిల్లీ, కాశ్మీరు యాత్ర చేశాం. మాలో ఒకడైన మూర్తి తల్లి తండ్రులు ఢిల్లీ లోనే ఉండేవారు. మూర్తి వాళ్ళ నాన్న గారు సెక్రటేరియట్ లో అండర్ సెక్రటరీ గా పనిచేసేవారు. ఢిల్లో లో ఉన్నన్న రోజులు వాళ్ళ ఇంట్లోనే మా బస. వాళ్ళ అమ్మ గారు మమ్మల్ని బాగా చూసుకొన్నారు.

 

ఢిల్లీ టూర్ లో విపరీతంగా నడవాల్సి వచ్చేది. “మన వాళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడు నొప్పులు, నొప్పులు అంటారండీ” అని మూర్తి వాళ్ళ అమ్మ గారు అంటుండేవారు. నడిచి నడిచి సాయంత్రానికి మాకూ నిజంగానే విపరీతంగా కాళ్ళ నొప్పులు వచ్చేయి. మూర్తి మాత్రం చక చకా మా అందరికంటే వేగంగా నడిచేవాడు. ఆయనకు నొప్పులు లేవు.

 

ఢిల్లీ తర్వాత కాశ్మీరు చూడాలని మా ప్లాన్. రాత్రి 10 గం.కు పాత ఢిల్లీ స్టేషన్ నుండి బయలుదేరే శ్రీనగర్ ఎక్స్ ప్రెస్ లో మా ప్రయాణం. సాయంత్రం 7 గం.కు సూట్ కేసులు, బ్యాగులతో అందరం బయలుదేరాం. ఇంటి దగ్గరలో ఉన్న Taxi Stand కు వెళ్ళి Taxi కావాలని అడిగాం. అన్నీ కిరాయికి వెళ్ళపోయినాయి అని అక్కడ ఉన్న సర్దార్జీ చెప్పాడు. అప్పుడే అటు వైపు ఖాళీ గా వెళ్తున్న ఒక taxi ని ఆపి మమ్మల్ని ఎక్కించి పంపాడు.

 

పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాం. ఇసుక వేస్తే రాలనట్లున్న అక్కడి జనాన్ని, టిక్కెట్ల క్యూలైన్లు చూస్తే ఠారెత్తెంది. అంత జనాన్ని, అంత ‘క్యూ’ ను అంతక ముందు ఏ స్టేషన్ లోనూ చూడలేదు. అరేయ్ మీరంతా శ్రీనగర్ ఎక్స్ ప్రెస్ దగ్గరకు వెళ్లి సీట్లు Occupy చేయండి. నేను ఎలాగో అలాగు టికెట్లు తీసుకువస్తాను అన్నాడు. మాకు రిజర్వేషన్లు, గిజర్వేషన్లు జాన్తానై కదా!

 

గబ గబా ఫ్లాట్ ఫాం కు వెళ్ళి శ్రీనగర్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ట్ ఫాం మీదకు రాగానే బాహా బాహీ, ముష్టా ముష్టి యుద్దం చేసి జనరల్ కంపార్ట్మెంట్ లో దూరి సీట్లు సాధించాం. వీరోచిత యుద్ధంలో సాధించిన విజయానికి జబ్బలు చరుచుకొంటూ సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నాం. పాపం టికెట్ల కోసం మూర్తి ఎంత కష్టపడుతున్నాడో! రైలు కదిలేటప్పటికి రాగలడో లేదో అని మాలో ఒకడి సందేహం.

 

రానే వచ్చాడు మూర్తి. ఇంకా హుషారు వచ్చింది. తనకు అట్టిపెట్టిన సీటులో కూర్చో పెట్టాము.

‘అరేయ్! నా బ్యాగ్ ఏదిరా?’ అడిగాడు మూర్తి.

 

భయంకరమైన నిశబ్దం. కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదంటారు గదా? అందరం అలా అయిపోయాం. టాక్సీ దిగి డిక్కీ నుండి ఎవరి బ్యాగు వాళ్ళు తీసుకొని హడావిడిగా ప్లాట్ ఫామ్ పైకి వచ్చేశాం. మూర్తి మా అందరి టికెట్ల కోసం వెళ్తే మేం తన బ్యాగ్ తీసుకురావాలన్న స్పృహ లేకపోయినందుకు సిగ్గు పడ్డాం.

 

‘మీరు వెళ్ళండి రా అని ట్రైను దిగాడు.’ మేం అంతా కూడా దిగిపోయి ఇంటికి వెళ్దాం అన్నాం. మమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా తాను ఆగిపోయి మమ్మల్ని వెళ్లమనడంతో మా అపరాధ భావన ఇంకా ఎక్కువయింది. అందరం అలాగే మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరాం.

 

నాల్రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని, ఢిల్లీ అంతా తనకు తెలిసిన ప్రదేశమే అయినా ఓపికగా తిప్పి చూపించాడు. చాలా కష్టపడ్డాడు మా కోసం. ఇల్లు దగ్గరకు వస్తున్న కొద్దీ వాళ్ళ అమ్మ గారికి మా ముఖం ఎలా చూపించాలా అని భయపడ్డాం. కానీ ఆవిడ ఏమీ అనలేదు.

 

మర్నాడు ఉదయం అందరం Taxi stand కు వెళ్ళి ఆ సర్దార్జీ కి జరిగింది చెప్పాం. అది మా టాక్సీ కాదు గదా అని తల పైకెత్తి ఒక్క నిమిషం ఆలోచించి ఒక నెంబరు చెప్పి ఇది అయి ఉండవచ్చు అన్నాడు. ఢిల్లీ లో Taxi stand లన్నిటికీ కలిపి సెంట్రల్ ఆఫీస్ ఉంది. అడ్రస్ చెప్పి అక్కడకు వెళ్ళి రిపోర్ట్ చేయండి అన్నాడు. ఆ ఆఫీస్ కి వెళ్ళాం. టాక్సీ నెంబరు కూడా మీరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయినా ప్రయత్నిద్దాం అని అడ్రసు తీసుకున్నాడు అక్కడ ఉన్న అసోసియేషన్ బాధ్యుడు. తిరిగి ఇంటికి వచ్చేశాము. ఆ రాత్రికి మూర్తి మమ్ములనందర్నీ మళ్ళీ శ్రీనగర్ Train ఎక్కించాడు.

 

కాశ్మీర్ చూసి మళ్ళీ ఢిల్లీ వచ్చేశాం. మూర్తి వాళ్ళ ఇల్లు దగ్గర పడుతుంటే మళ్ళీ దిగులు. బిక్క ముఖాలు వేసుకొని బెల్లుకొట్టాం. మూర్తి వాళ్ళ అమ్మగారు తలుపు తీసి మమ్మల్ని చూసి బ్యాగ్ దొరికిందని చెప్పారు. అప్పటి మా సంతోషం ఇప్పుడు నేను మాటల్లో చెప్పలేను.

 

మేం శ్రీనగర్ వెళ్ళిన మర్నాడే టాక్సీ డ్రైవర్ వచ్చి బ్యాగ్ ఇచ్చాడట. “మీరు లగేజీ కార్లో మర్చిపోతే మాకెంత చెడ్డ పేరు. మర్నాడే నేను మా యూనియన్ ఆఫీసుకు వెళ్ళి ఈ బ్యాగును అందజేశాను. మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీ అడ్రసు నాకు తెలిసింది. మీ తరువాత ఎక్కిన పాసింజర్లు ఈ బ్యాగ్ తీసుకుపోతే నా పరిస్ధితి ఏమిటి?” అని విసుక్కున్నాడట. మంచివాడు. డబ్బులు ఇవ్వబోతే ఆ ఇంటికి రావడానికి అయిన పెట్రోల్ ఖర్చు 7 రూపాయలు మాత్రమే తీసుకున్నాడట. కాఫీ ఇచ్చి పంపారట.

 

అందరి మనసులూ తేలికపడ్డాయి.

 

ఇదండీ మూర్తి బ్యాగు – దానికి కధా కమా మిషు.

 

ఈ అనుభవ పాఠం తర్వాత ఏ ప్రయాణంలోనైనా ఎవరి బ్యాగు వాళ్ళే పట్టుకోవాలని రూలు పెట్టాను మా కుటుంబంలో. చిన్నదైనా, పెద్దదైనా ఏ ప్రయాణంలోనూ ఈ రూలు తప్పలేదు. మళ్ళీ ఎవరి బ్యాగు పోలేదు.

 

- డి.ఆర్.కె. ప్రసాదు


27.07.2020.