ప్రభావశీలమైన జనరల్ సెక్రటరీ గా జీవియస్ మూర్తి....           (28-Jul-2020)


 గుర్తుకొస్తున్నాయి – 6

కాలేజీ కబుర్లు...

 

ప్రభావశీలమైన జనరల్ సెక్రటరీ గా జీవియస్ మూర్తి

 

1974 లో మేము మెడిసిన్ లో చేరిన మొదటి సంవత్సరంలోనే ఒక Strike చేశాం. ఆ సందర్భంలోనే మా క్లాస్ మేట్ లైన GVS మూర్తి, హాషింలతో అనుబంధం ఏర్పడింది. మేము సమ్మె చేయడం వలనే ఫిజిక్స్, ఇంగ్లీషు, బయాలజీ పరీక్షలు రద్దయ్యాయి. Organic Chemistry పరీక్ష మాత్రం రాసినట్లు గుర్తు.

 

ఆ తరువాత సం. నుండీ MBBS కోర్సును నాలుగున్నర సంవత్సరాలుగా కుదించారు. 5 సంవత్సరాల కోర్సు చేసిన చివరి బ్యాచ్ మాదే. అందుకే మాకూ తరువాత బ్యాచ్ కు తేడా 6 నెలలే!

 

GVS ను ఎక్కువ మంది మూర్తి అని పిలిచేవారు. నేను మాత్రం ‘సత్యన్నారాయణ మూర్తి’ అని పూర్తి పేరుతోనే పిలిచేవాడిని. నేను హాస్టల్ లో చేరిన తర్వాత మరింత దగ్గరయ్యాం.

 

Clinics లోకి రాగానే జనరల్ సెక్రటరీ గా మూర్తి పోటీ చేసినప్పుడు వేసిన కర పత్రాలలో GVS Murthy అని ఉండేది. అప్పటి నుండీ అందరూ GVS అని పిలుస్తూ ఉంటే నేను కూడా ఆ పిలుపునే ఖాయం చేసుకున్నాను.

 

కాలేజీ వెనుక ఉన్న Open Air Theatre ఎదురుగా ఉన్న భవనంలో Students Association గది ఉండేది. జనరల్ సెక్రటరీ గా ఉన్న కాలం లో మధ్యాహ్నం భోజనం తర్వాత ఎక్కువగా అక్కడే ఉండేవాడు.

 

Students ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యలు చెబితే వెంటనే ఆఫీసుకు వెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నించేవాడు. ఎక్కువగా Social Welfare Scholarships సమస్యలు ఉండేవి. వ్యక్తిగత సమస్యలైనా, అందరి సమస్యలైనా అన్నింటిని వాయిదా వేయకుండా పరిష్కారానికి కృషి చేసేవాడు.

 

Murthy you are a Hard Bargainer :

 

ఏదైనా సమస్య గురించి ప్రిన్సిపల్ తో GVS వాదిస్తుంటే అది మనం వినాల్సిందే! ఆ వాదన వినసొంపుగా ఉండేది. ప్రిన్సిపల్ ప్రశ్న వేయగానే సమాధానం చెప్పేవాడు. ఆ సమాధానంలోనే మళ్ళీ ప్రిన్సిపల్ కు ఒక ప్రశ్న ఉండేది. ఆయన సమాధానం చెప్పుకోవలసి వచ్చేది. ఒకసారి ప్రిన్సిపల్ “Murthy you are a Hard Bargainer” అన్నారు. (C.M. రావు గారు అని గుర్తు). చివరకు ప్రిన్సిపల్ అలిసిపోయి ‘సరే కానివ్’ అనే పరిస్థితి వచ్చేది.

 

జనరల్ సెక్రటరీ గా చేసిన సంవత్సరంలో ఎంతో మందికి సహాయం చేశాడు GVS. క్లాసులు మానేసి కూడా పనిచేసేవాడు. కానీ Subjects లో ఎప్పుడూ వెనుకపడలేదు. SPM ఎందుకు పోయిందో మనందరికీ తెలుసు.

అదే తన జీవితంలో మలుపేమో! లేకుంటే AIIMS లాంటి సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ లో S.P.M. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యడమే కాకుండా Preventive ophthalmology లో International Authority గా పేరుపొందటానికి కారణం తన ‘కష్టం, కమిట్మెంటే’ అయినా ఆ ‘లక్ష్యాన్ని’ ఏర్పరుచుకొనడానికి SPM పరీక్షలో బ్రేకు పడడమే అని అనుకొంటున్నాను.

 

Curative medicine లో మనం ఎన్ని కేసులైనా చికిత్స చేసి ప్రాణాలు కాపాడవచ్చు కానీ Preventive Medicine లో మన పాత్ర ఏమీ లేదే అని తరచుగా దిగులు పడుతుండేవాడిని.

 

బాధలను తగ్గించి డబ్బులు జేబులో వేసుకోవడం మాత్రమే చేయడం
‘వృత్తికి పూర్తిగా న్యాయం చేయడంకాదు’ అనిపించేది.

 

స్వచ్చ చల్లపల్లి. ఉద్యమంతో నాకు ఆ దిగులు తగ్గింది. Preventive Medicineలో మన సహచరుడు చేస్తున్న కృషికి ఎంతో సంతోషంగానూ, గర్వం గానూ ఉంది.

 

PG లో చేరకముందు భూటాన్ లోని ‘చుక్కా హైడల్ ప్రాజెక్ట్’ లో Medical Officer గా పనిచేసేవాడు. అక్కడ నుండీ రాసిన ఉత్తరాలు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి.

 

హాస్టల్ లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పిరియడ్ లో ఎలక్షన్లు లేవు. అప్పటి వార్డెన్ GVS నే జనరల్ సెక్రటరీ గా నియమించారు. ‘బాత్ రూమ్ లు, టాయిలెట్లు అస్సలు శుభ్రంగా లేవు’ అని ఒకసారి నేను చెప్తే ‘ఆ పని నువ్వే చూడు’ అని నాకప్పగించాడు. ఆ సంవత్సరం బాత్ రూంలు, టాయిలెట్లు నిర్వహణ నేనే చూశాను.

 

కాలేజీ జనరల్ సెక్రటరీ గా, హాస్టల్ జనరల్ సెక్రటరీ గా పూర్తి న్యాయం చేసిన వ్యక్తి మా GVS. తను ఎక్కడున్నా తన Impact కచ్చితంగా ఉంటుంది.

 

రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వాలకు మంచి సలహాలిస్తూ వృత్తిని కొనసాగించడం మనందరకూ గర్వకారణం.

 

తన అనుభవాన్ని, సేవలను ఈ ప్రభుత్వాలు సక్రమంగా ఉపయోగించుకోవాలని నా ఆశ.

 

- డి.ఆర్.కె
28.07.2020.