ఏ కారు దగ్గరకు తీసుకురమ్మంటారు సార్?....           (30-Jul-2020)


 గుర్తుకొస్తున్నాయి...... 7

కాలేజీ కబుర్లు

 

ఏ కారు దగ్గరకు తీసుకురమ్మంటారు సార్?

 

హౌస్ సర్జన్సీ లో ఉన్నప్పుడు బెంగుళూరు, మైసూరు, ఊటీ యాత్ర చేశాం. రుద్రా, సూర్య ప్రకాష్, సాంబిరెడ్డి, మాధవరావు, PDP రావ్, సలీం ఇంకా కొంతమంది మిత్రులం కలిసి వెళ్లాం.

 

మొదటి రెండు రోజులు బెంగుళూరులో ఉన్నాం.

 

"బ్రిగేడ్ రోడ్డు కు వెళ్దాం. ఆ వీధికి బాగా డబ్బున్న వాళ్లు, సినిమా యాక్టర్లు వస్తారట” అని మాలో ఒకడి సలహా! అందరికీ నచ్చింది.

 

అక్కడికి ఎలా వెళ్లాలి అని ఒకతన్ని అడిగాం. 'కుంజం దూరం నడచి వెళ్ళండి’ అని చెప్పాడు. కాస్త దూరం వెళ్లాక మరొకర్ని అడిగితే 'కుంజం దూరం' అన్నాడు. అలా ఎంతదూరం నడిచామో! అడిగిన ప్రతివాడూ 'కుంజం దూరమే' అంటున్నాడు. నడిచి నడిచి కాళ్లు విపరీతంగా నొప్పులు పుట్టాయి 😔.

 

బ్రిగేడ్ రోడ్డు చేరేటప్పటికి అందరం అలసిపోయాం. సిటీ లో వాళ్లు మనకంటే చాలా ఎక్కువ నడుస్తారు కాబోలు అనుకున్నాము. ఆ తరువాత కొంతకాలం మా మధ్య 'కుంజం దూరం' అనే మాట ఒక జోక్ అయ్యింది.

 

బ్రిగేడ్ రోడ్డు నిజంగానే రకరకాల కార్లు, ఖరీదైన షోరూంలతో పోష్ గా ఉంది. కాసేపు అటూ ఇటూ తిరిగాం.
సినిమా యాక్టర్లలాంటి వారెవ్వరూ కనపడలేదు. సరే అని ఒక ఐస్ క్రీం షాపుకు వెళ్లి ఐస్ క్రీం ఆర్డర్ చేశాం.

 

‘ఏ కారు దగ్గరకు తీసుకురమ్మంటారు సార్?’


మేం ఊహించని ప్రశ్న వచ్చింది షాపతని వద్ద నుండి.


ఒకళ్ల మొఖాలు ఒకళ్లు చూసుకున్నాం.

 

కారు అనేది మాకెవరికీ ఊహల్లో కూడా లేదు. ముందు ముందు కొనుక్కోవాలనే ఆలోచన కూడా లేనివాళ్లం.

 

అనుకోని సమాధానం మాలో ఒకణ్ణించీ వచ్చింది.

 

వేలు చూపిస్తూ 'ఆ కారు దగ్గరకి తీసుకురా' అని అతనితో గంభీరంగా చెప్పి ‘రండ్రా’ అని మమ్మల్నందర్నీ ఓ మంచి కారు దగ్గరకు తీసుకువెళ్లి నించోపెట్టాడు.

 

అక్కడికే ఇస్ క్రీం లు తెచ్చాడు బేరర్.


మా సొంత కారులాగా ఆ కారుని ఆనుకొని దర్జాగా నుంచొని ఐస్ క్రీం ఆరగించాం.

 

ఇంతకీ ‘ఆ కారు దగ్గరకు’ అని చెప్పినోడు ఎవరనుకొన్నారు?

 

ఇంకెవరు మాలో ఉన్న ఏకైక నవాబు – ‘సయ్యద్ సలీం’.

 

ఇప్పుడందరికీ కార్లు ఉన్నాయి కానీ అప్పట్లో వాళ్ళ ఇంట్లోనే ఒక అంబాసిడర్ కారు ఉండేది.

 

- డి.ఆర్.కె
30.07.2020