కృష్ణానదిలో కొట్టుకుపోతుండగా....           (31-Jul-2020)


 గుర్తుకొస్తున్నాయి...8

కాలేజీ కబుర్లు

 

*కృష్ణానదిలో కొట్టుకుపోతుండగా.......*

 

మేము ఫస్టియర్ లోనే చీరాల, నాగార్జునసాగర్, అమరావతి పిక్ నిక్ లకు వెళ్లాం. నాగార్జున సాగర్ పిక్ నిక్ ‘రాందాసు’ ఆధ్వర్యంలో జరిగింది.

 

‘జయరాం’ జనరల్ సెక్రటరీగా గెలిచినప్పుడనుకొంటా అన్ని బ్యాచ్ ల వాళ్లం కలిసి ‘అమరావతి’ వెళ్లాం.

 

గుడి వగైరాలు చూసి, చెట్ల కింద ఆటలాడుకొన్నాం(గుండ్రంగా కూర్చొని వెనుక ‘జేబు రుమాలు’ వేస్తే కనుక్కోవడం వగైరాలు). భోజనాల తర్వాత కృష్ణానది మధ్యలో ఉన్న ఒక చిన్న లంకకు (island) పడవ మాట్లాడుకుని వెళ్లాం. దాదాపు 60 మందిమి ఉన్నాం. కాసేపు అక్కడా ఆటల కార్యక్రమం కొనసాగించాం.

 

స్నానాలు చేసేవారు చేస్తున్నారు. నాకు ఈత బాగా వచ్చు కదా అనే ధైర్యంతో నేను కూడా నదిలో ఈదుతున్నాను. కాసేపటికి నేను ప్రవాహంలో కొట్టుకుపోతున్నానని అర్థం అయింది. ఇది గమనించిన మన సీనియర్ P.P. కోయా ఈదుకుంటూ నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని ఒడ్డుకు తీసుకువెళ్లాడు.

 

అప్పుడు చూద్దుము కదా ప్రవాహ ఉరవడి ఎక్కువయింది. మేం ఉన్న ద్వీపం నెమ్మదిగా మునిగిపోతోంది. కంగారుగా అందరం పడవ ఎక్కి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మధ్యలోకి వెళ్లిన తర్వాత చూద్దుము గదా నది బాగా పొంగి సముద్రంలా ఉంది.

 

ఇంతలో పడవకు ఒక ప్రక్కన ఉన్న వాళ్ళు కదిలారు. పడవ అటూ ఇటూ బాగా ఊగుతోంది. తిరగబడుతోంది అని అందరం కంగారు పడ్డాం. ఎక్కడి వాళ్ళు అక్కడే కదలకుండా ఉండండని పడవ సరంగు గట్టిగా అరిచాడు. భయంతో అలాగే ప్రాణాలు బిగపట్టుకొని కదలకుండా ఉన్నాం.

 

ఆవలి ఒడ్డుకు చేరేవరకు ఆ టెన్షన్ కొనసాగింది. రెండు ఫర్లాంగుల అవతల ఒడ్డున ఆగింది పడవ. అప్పుడు మేం బయలు దేరిన దిబ్బను చూస్తే దాదాపు మునిగిపోయింది. బ్రతుకు జీవుడా అనుకున్నాం.

 

ఆ రోజు ఆ పడవ తిరగబడితే మహా అయితే కోయా లాంటి ఇద్దరు ముగ్గురు కన్నా బ్రతికి బయటపడే వాళ్ళు కాదు. పెద్ద ప్రమాదం తప్పింది. నాగార్జున సాగర్ నుండి నీళ్లు ఆరోజు వదిలేరని ఆ మర్నాడు పేపర్లో చదివాం.

 

ఇక కోయా సంగతి. మన కాలేజీలో అప్పుడు ఇద్దరు కోయాలు ఉండేవారు. పెద్ద కోయా పూర్తి పేరు ‘P.P. కోయా’. ఇతను మిత్రా కి కూడా సీనియర్.

 

చిన్న కోయా పేరు ‘ఆట్ట కోయా’. వీళ్లు లక్ష దీవుల నుండీ వచ్చారు. అప్పుడు మన కాలేజీకి సెంట్రల్ గవర్నమెంటు కోటా ప్రతి సంవత్సరం ఒక్క సీటు ఉండేది. వీళ్ళు ఆ కోటాలో వచ్చారు. మలేషియా నుండి వచ్చిన ఒకతను Hostel old block లో ఉండేవాడు. పేరు గుర్తులేదు. కోర్సు పూర్తి చేసినట్లు లేడు. పేరు ఎవరికన్నా తెలిస్తే చెప్పగలరు.

 

ఈ P.P. కోయా ఆ తర్వాత లక్ష దీవుల నుండి Member of Parliament అయ్యాడు. అప్పటి దాక అక్కడ గెలుస్తున్న ఒక పెద్ద లీడర్ ని ఓడించాడు. కొద్ది సంవత్సరాల క్రితం వీళ్ల బ్యాచ్ రీ యూనియన్ సందర్భంగా మన కాలేజీ కి వచ్చాడని తెలిసింది.

 

నా ప్రాణాల్ని కాపాడిన P.P. కోయాని ఎప్పటికీ మర్చిపోలేను.

 

హౌస్ సర్జన్సీలో NSS camp కోసం కారంపూడి వెళ్ళినప్పుడు నాగార్జున సాగర్ కుడి కాలువలో మళ్ళీ ఒక జల గండం వచ్చింది.

 

ఆ కబుర్లు మరొకసారి....

 

- డి. ఆర్. కె
31.07.2020