ఇక్కడ లాడ్జింగ్ బోర్డింగ్ ఫ్రీ.......           (01-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...9

కాలేజీ రోజులు

 

ఇక్కడ లాడ్జింగ్ బోర్డింగ్ ఫ్రీ...


ఒకసారి మా classmate T.B. రామకృష్ణ మమ్మల్ని అల్పాహారానికి ఒక Star హోటల్ కు తీసుకువెళ్లాడు. లోపలికి వెళ్ళగానే సూట్ వేసుకున్న ఒకాయన ఎదురొచ్చి ఎంతమందిమో తెలుసుకొని, టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి, కుర్చీలు కాస్తలాగి కూర్చోమని చెప్పాడు.

 

‘అబ్బో ఎంత మర్యాద!’ అనుకొన్నాం.


మొదటి సారి పెద్ద హోటల్ కు వెళ్ళడం కదా!

 

అందరం కూర్చొన్న తర్వాత T.B. రామకృష్ణ ముందుకు వంగి “ఇక్కడ కాఫీ, టిఫిన్లు ఫ్రీ తెలుసా?” అన్నాడు.

 

ఛ! మరి ఎలా గిట్టుబాటు అవుతుంది. A/C హోటల్ కూడా గదా! అన్నాను.

 

‘మర్యాదకు మాత్రం ఛార్జ్ చేస్తారు’ అన్నాడు కూల్ గా తనదైన స్టైల్లో కుర్చీ వెనక్కి ఆనుకొని.

 

అప్పుడు గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది.

 

బెంగుళూరు, మైసూరు, ఊటీ టూర్లో భాగంగా మైసూరు నుండీ శ్రీరంగపట్నం టాక్సీలో వెళ్తున్నాం. టూరిస్టులం కదా టాక్సీ డ్రైవర్ దారి పొడుగూ మాకు ఆ ప్రాంతపు విశేషాలు చెబ్తూనే ఉన్నాడు. దారిలో ఒక పెద్ద భవనం కనిపించింది.

 

ఆ భవనాన్ని చూపుతూ “ఇందులో లాడ్జింగ్, బోర్డింగ్ ఫ్రీ అండీ” అన్నాడు.

 

మేమంతా చాలా ఆశ్చర్యపోయి ‘ఎందుకని?’ అని అడిగాం.

 

“అది జైలు కనుక” అన్నాడు తాపీగా.

 

నవ్వుకొన్నాం.

 

ఇలా రోజూ ఎన్ని సంవత్సరాల నుండీ ఈ జోకు వేస్తున్నాడో.

 

ప్రతి రోజూ కొత్త మనుషులే కదా ఆయన కస్టమర్లు!

 

- డి.ఆర్ కె
01-08-2020