‘రూం నెం11/A హౌస్ సర్జన్స్ క్వార్టర్స్’....           (03-Aug-2020)


గుర్తుకొస్తున్నాయి...11
కాలేజీ కబుర్లు

*‘రూం నెం11/A హౌస్ సర్జన్స్ క్వార్టర్స్’*

7/G బృందావన్ కాలనీ – ఇది ఒక హిట్టైన సినిమా

‘రూం నెం11/A హౌస్ సర్జన్స్ క్వార్టర్స్’ – మనలో కొంతమందికి మధురస్మృతులు మిగిల్చిన గది

11 గాదు 12 గాదు మధ్యలో ఈ
11/A ఏమిటీ?

ఇదొక విచిత్రమైన గది. ఏ గది అయినా నలుచదరం గానో, దీర్ఘ చతురస్రం గానో ఉంటుంది కదా. కానీ ఇది వేరే షేపులో ఉండేది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ OP బ్లాక్ పైన 3 వ అంతస్తులో హౌస్ సర్జన్స్ క్వార్టర్స్ ఉండేవి. మెట్లు ఎక్కి 3 వ అంతస్తుకు వెళ్ళగానే మొట్ట మొదటిగా కనిపించేది ఈ గదే.

మా ముందున్న సీనియర్లు ఈ రూంలోనే ఒక మూల ‘తెర’ ఏర్పాటు చేసి స్నానాల గదిగా వాడేవారు. మేం ఆ వారసత్వాన్ని కొనసాగించాం. ఏ సీనియర్ల ద్వారా ఈ గది మాకొచ్చిందో గుర్తు లేదు. నేను ఆ రూమ్ లో జాయిన్ అయ్యేటప్పటికే ధీరానంద్ కొంతకాలం అందులో ఉండి వెళ్లిపోయాడట.


T.B., నేను, రుద్ర, మాధవరావు, M.V. సత్యన్నారాయణ, Ch. ప్రభాకర్, కేశవరావు ఉండేవాళ్ళం (కేశవరావు మా జూనియర్. ప్రస్తుతం గుడివాడలో సొంత హాస్పిటల్ నడుపుతున్నాడు.)

హౌస్ సర్జన్సీ అయిపోయినా P.G. entrance కోసం చదివే సమయంలో కూడా ఆ గదిలోనే ఉండేవాళ్లం. జూనియర్లలోని స్నేహితులనే రూం మేట్లుగా తీసుకునేవాళ్ళం. హౌస్ సర్జన్సీ పూర్తయినా అదే రూమ్ లో ఉండడానికి ఈ ఏర్పాటు. మా జూనియర్ ‘సత్యమూర్తి’ అలానే ఈ గదిలో చేరాడు. రెండు మంచాలు నిలువు, ఒక మంచం అడ్డంగా పెట్టి అన్నీ కలిపి అందరం వాటి మీదే పడుకునేవాళ్లం. ఆ రూం లో ఒకటే ఫ్యాన్ ఉండేది.

హౌస్ సర్జన్సీ లో Stipend 300 రూపాయలు వచ్చేది. కొంతకాలం తర్వాత 500 రూపాయలకు పెంచారు. మేము ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు అది. అప్పుడప్పుడు ఆరండల్ పేట నాలుగో లైన్లో ఉన్న ‘మయూర’ రెస్టారెంట్ కు గానీ, జిన్నాటవర్ వద్దనున్న ‘సెంట్రల్ కేఫ్’ కు గాని వెళ్ళి Non Veg తినేవాళ్లం.

స్నేహితులను కలుపుకొని చాలా మందిమి ఒక గ్రూప్ గా వెళ్ళేవాళ్ళం. మయూర లో ఏం తినేవాళ్ళమో గుర్తులేదు. సెంట్రల్ కేఫ్ లో “కోడి వేపుడు, చేప వేపుడు, చేపల పులుసు” ఇలా బోర్డ్ మీద కూరలన్నీ తెలుగులో రాసి ఉండేవి. మామూలు భోజనానికి వీటిని అదనంగా ఆర్డర్ చేయవచ్చు. మేం ఎక్కువ సార్లు తలా ఒక ప్లేటు ‘కోడి కూర’ తినే వాళ్ళం. ఆ కాలంలో మాకది పెద్ద లగ్జరీ (ప్రస్తుతం నేను శాకాహారుణ్ణి).

సందడే సందడి :

మా రూమ్ ఎప్పుడూ వచ్చే పోయే జనంతో సందడిగా ఉండేది. మిగతా రూంలలో ఉన్న మిత్రులు కూడా తరచుగా ఇక్కడికొచ్చి కబుర్లు చెబుతూ ఉండేవారు. ఈ రూం లో స్పెషల్ ఎట్రాక్షన్ మా బాత్ రూం. ఎప్పుడన్నా బయట బాత్ రూం లు ఖాళీగా లేకపోతే మా బాత్ రూం కి వచ్చి స్నానం చేసేవారు.

గురూ! ఒక్క సారి స్టాంపు ఇస్తారా?

ఫ్రెండ్స్ అయితే గబుక్కుని తలుపు తీసుకొని గబగబా లోనికి వచ్చేసేవారు.
అప్పుడప్పుడూ మాకు చిత్రమైన అతిధులు వస్తుండేవారు. వీరు నెమ్మదిగా తలుపు తీసి మొహమాటంగా నవ్వుతూ అడుగులో అడుగేసుకొంటూ వచ్చి 'గురూ, ఒక్కసారి స్టాంప్ ఇస్తారా' అని చెవిలో అడిగేవారు.

హౌస్ సర్జన్సీ అయిపోయిన తరువాత P.G కి గాని, ఉద్యోగానికి గానీ అప్లై చేయడానికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటికీ 'ట్రూ కాపీలు' కావల్సి వచ్చేవి. ఈ ట్రూ కాపీల మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి. అందరికీ అందుబాటులో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఉండేవాడు. ఒక్కొక్కళ్ళకి దాదాపు 60 ట్రూ కాపీలపై సంతకాలు పెట్టాల్సి వచ్చేది. దాంతో CMO లకు విసుగు వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఒక మిత్రుడు సృజనాత్మకంగా ఆలోచించి ఎవరికీ తెలియకుండా ఒక CMO స్టాంపు చేయించుకొచ్చాడు😀 తనకవసరమైనప్పుడల్లా ట్రూ కాపీల మీద ఈ స్టాంపు వేసేసుకుని CMO సంతకం పెట్టేసుకునేవాడు. స్టాంపును భద్రంగా ట్రంక్ పెట్టెలో పెట్టుకుని తాళం వేసుకునేవాడు.

రాజు గారి గాడిద చెవులు :

తరువాత తన క్లోజ్ ఫ్రెండ్స్ కి ఈ సౌకర్యాన్ని అందించాడు.
'రాజు గారివి గాడిద చెవులు' అన్న విషయం అందరికీ ఎలా బట్టబయలయిందో అలాగే ఈ అతి రహస్యం కూడా హౌస్ సర్జన్స్ క్వార్టర్స్ అంతా రహస్యంగానే పాకిపోయింది. అందరికీ ఏదో ఒక సమయంలో ఈ అవసరం వచ్చేది. ఒకొక్కళ్లు ఇలా నెమ్మదిగా వచ్చి చెవిలో 'గురూ, ఒక్క సారి స్టాంపు ఇస్తావా' అని మొహమాటపెట్టి స్టాంపు తీసుకుని వాడుకునేవారు.


పొదుపుగా డబ్బు వాడకం :

హౌస్ సర్జన్సీ అయిపోయిన తర్వాత Stipend లేదు. P.G. entrance కోసం తయారవుతుండే వాళ్ళం. ఉదయాన్నే విష్ణు విలాస్ గానీ, ఆ ప్రాంతంలో ఉన్న మరో హోటల్ లో గానీ టిఫిన్ చేసే వాళ్ళం. రెండు ఇడ్లీ, ఒక గారె ఖరీదు ఒక రూపాయి. ఒక రూపాయి కంటే ఎక్కువ బ్రేక్ ఫాస్ట్ కు కేటాయించడం సాధ్యం అయ్యేది కాదు. కడుపు నిండడానికి సాంబారు తో తినేవాణ్ణి.

రైలుపేటలోని సుబ్బమ్మ మెస్ లో కానీ, సుబ్బాయమ్మ మెస్ లో కానీ భోజనానికి 30 టికెట్లు 75 రూపాయలకు కొనుక్కోనేవాళ్ళం. ఒక భోజనం రెండున్నర రూపాయలు పడేది. తిండి ఖర్చు 1 + 2.50 + 2.50 = 6 రూపాయలతో సరిపెట్టుకునే వాళ్లం. కాలేజీ లైబ్రరీ లో ఉదయం 9 గం. నుండీ రాత్రి 8 గం, వరకు చదువుకునే వాళ్ళం. సాయంత్రం 5 గం.కు లైబ్రరీ బయటకు వచ్చి అప్పుడప్పుడు ‘పప్పుండలు’ తినేవాళ్లం. వాటి ఖరీదు ఒక్కొక్కటి 10 పైసలు అని గుర్తు. వాటిని మేము ‘బలవర్ధినులు’ అని పిలుచుకునేవాళ్ళం. రాత్రిళ్ళు రూం లోనే చదువుకొనే వాళ్ళం. అర్ధరాత్రి అప్పుడప్పుడు రైలు పేటలో ఉన్న టీ కొట్టు వద్దకు కానీ, సరస్వతి టాకీస్ లో ఉన్న టీ కొట్టు దగ్గరకు కానీ వెళ్ళి టీ తాగుతుండేవాళ్ళం.

బట్టల ఇస్త్రీ ఖర్చు తప్ప ఇంకా వేరే ఖర్చు లేవీ ఉండేవి కాదు.
రూంరెంట్ ఎలాగూ లేదు కదా. ఖర్చు తగ్గించుకోడానికి ఒకరికి మరొకరు క్షవరం చేసుకునే వాళ్ళం. తారక్ కి కూడా ఒకసారి నేను క్షవరం చేశాను.

విష్ణు విలాస్ :

గవర్నమెంట్ హాస్పిటల్ కు ఎదురుగా ఉండడంతో చాలా రష్ గా ఉండేదీ హోటల్. సర్వీస్ గూడా ఫాస్ట్ గానే ఉండేది. ఆ హోటల్ గురించి రెండు విషయాలు చెప్పాలి.

మొదటిది :

టిఫిన్ చేసిన తర్వాత సర్వర్ మనకు బిల్లు ఇచ్చేవాడు. ఆ బిల్లు తీసుకొని కౌంటర్ లో డబ్బు కట్టాలి. కౌంటర్ లో ఉన్న క్యాషియర్ ఈ బిల్లు తీసుకొని ఒక్క క్షణం చూసి, టేబుల్ మీద ఉన్న స్టీలు ఊసకు గుచ్చి, మన దగ్గర డబ్బు తీసుకొని, చిల్లర తిరిగి ఇచ్చేవాడు. ఇదంతా మెరుపువేగంతో చేసేవాడు!
Hand, eye coordination చూడముచ్చటగా ఉండేది. కాలుక్యులేటర్లేవీ లేవప్పడు. లెక్కలు మనసులోనే చిటికెలో వేసేసేవాడు. అందుకే ఎంత మంది కస్టమర్లు ఉన్నా కౌంటర్ దగ్గర ఆలస్యమయ్యేది కాదు.

రెండవ విషయం :
ఆవు కధ :

రోజూ ఉదయం విష్ణు విలాస్ లో మేం టిఫిన్ చేసే సమయానికి ఒక ‘ఆవు’ వచ్చి ఈ హోటల్ గేటుకు ఎదురుగా నుంచుని ఒకటి రెండు సార్లు ‘అంబా’ అనేది. ఆ శబ్దం వినగానే అక్కడ పనిచేసే సర్వర్ లలో ఒకరు ‘రెండు ఇడ్లీలు’ ఒక విస్తర్లో పెట్టి, ఆ విస్తరిని మడిచి దాని నోట్లో పెట్టేవారు. అది చక్కగా నములుతూ మరో హోటల్ కు వెళ్ళేది. సర్వర్లు వాళ్ళ హడావుడిలో ఎప్పుడన్నా దాన్ని పట్టించుకోకుండా ఆలస్యం చేస్తే గుమ్మం దాటి హోటల్ లోపలికి వెళ్ళి నుంచునేది. అప్పుడు వాళ్ళు దానికి పెట్టవలసినది పెట్టేవారు. వెంటనే వెళ్లిపోయేది.

ఇప్పుడు విష్ణు విలాస్ ఉందో లేదో నాకు తెలియదు. ఆ హోటల్ ఉండి ఉండచ్చేమో కానీ ఆవు మాత్రం బ్రతికి ఉండే అవకాశం లేదు. కానీ విష్ణు విలాస్ ముందు నెమరువేస్తూ ఉన్న ఆ ఆవు ఇప్పటికీ నా కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది.

మాధవరావు కు Anesthesia లో M.D సీటు వచ్చింది.
(సంవత్సరం తరువాత దానిని వదిలేసి మళ్ళీ entrance రాసి జనరల్ M.S. కొట్టాడు.
దమ్మున్నోడు కదా!)

T.B. కేరళ వెళ్లిపోయాడు. M.V. ఆర్ధోపెడిక్స్ M.S. లోనూ, రుద్ర D.Ch లోనూ, కేశవరావు జనరల్ M.D లోనూ, నేను DGO లోనూ చేరాం.

DGO మొదటి సంవత్సరం చివరిలో నేను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత రైలుపేటలో కాపరం పెట్టి 11/A ఖాళీ చేసి వెళ్లిపోయాను. మాధవరావు M.S. పూర్తయ్యేవరకు ఆ రూమ్ లోనే మరికొంతమంది జూనియర్లతో కలిసి ఉన్నాడట.

తర్వాత్తర్వాత 11/A లో ఎవరెవరు ఉన్నారో నాకు తెలీదు. ఇప్పుడు GGH బిల్డింగులలో చాలా మార్పులు వచ్చాయని మాధవరావు చెప్పాడు. 11/A పేరు కూడా ఉండకపోవచ్చు.

హాస్టల్ జీవితం ప్రత్యేకమైనది. ఎంతో సరదాగా ఉంటుంది.
మంచి వాళ్ళు,
బాగా చదువుకునే వాళ్ళు,
అసలు చదువు పట్టించుకోనివాళ్ళు,
కొన్ని అలవాట్లకు గురైన వాళ్ళు,
రాజకీయాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు
- ఇలా రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న వారు ఉంటారు.
భిన్న మనస్తత్వాలున్న వారితో వ్యవహరించవలసి వస్తుంది. ఇలా అందరితో వ్యవహరిస్తూనే మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే హాస్టల్ జీవితంలో ముఖ్యమైన, అందమైన అనుభవం.

స్టూడెంట్స్ గా హాస్టల్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేశాం. హౌస్ సర్జన్సీ లో, P.G కోసం ప్రిపరేషన్ లో, P.G లోను 11/A లో ఉండడం కూడా హాస్టల్ జీవితం కొనసాగింపే!

- డి.ఆర్.కె.
03.08.2020