All promises need not be kept DRK....           (02-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి....10

కాలేజీ రోజులు

 

All promises need not be kept DRK

 

1974లో MBBS లో చేరడానికి సర్టిఫికెట్లు పట్టుకొని మేమందరం ఆఫీసు రూం ముందు వరుసలో నుంచున్నాం. ఒక సీనియర్ వచ్చి రేయ్! అంటూ పెద్ద గొంతేసుకుని ఒక్కొక్కళ్లని ప్రక్కకు పిలిచి రాగింగ్ చేస్తున్నాడు.

 

మాలో చాలామంది తండ్రులు కూడా మమ్మల్ని కాలేజీలో జేర్చడానికి వచ్చారు. తండ్రుల ఎదురుగానే వాళ్ల పిల్లల్ని పిలిచి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం నాకు జుగుప్సగా అనిపించింది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. “ఎప్పుడూ రాగింగ్ చేయకూడదని”.

 

అలాగే కాలేజీ నుండి బయటకు వచ్చే వరకు నేనెవర్నీ రాగింగ్ చేయలేదు. రాగింగ్ కు గురవుతున్న ఫ్రెషర్స్ ను ప్రొటెక్ట్ చేసి స్నేహం చేసుకునేవాణ్ణి. ఇలా రాగింగ్ చేయని మిత్రులు మాలో చాలామంది ఉన్నారు.

 

మా తర్వాత బ్యాచ్ లో కృష్ణ కుమారి అని ఒకమ్మాయి ఉండేది. తెనాలి అనుకుంటా వాళ్ళ ఊరు. KK అని పిలిచేవారు వాళ్ల క్లాస్ మేట్స్. ఒకరోజు హిప్పోక్రిటిస్ హాల్లో ఏడుస్తూ కనిపించింది. ఎవరో రాగింగ్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని ప్రక్కకు తీసుకెళ్లి ఓదార్చాను. 'రాగింగ్ చేయని వాళ్లం చాలా మందిమి ఉన్నాం. దిగులు పడకు ' అని ధైర్యం చెప్పాను.

 

‘వచ్చే సంవత్సరం నువ్వు నీ జూనియర్స్ ను రాగింగ్ చేయకూడదు మరి ’ అని అడిగాను. ‘అయ్యో ప్రామిస్ సర్ నేను ఎవ్వర్నీ రాగింగ్ చేయను’ అని మాట ఇచ్చింది.

 

ఆ మరుసటి సంవత్సరం వాళ్ల జూనియర్స్ లో ఒకర్ని భయంకరంగా రాగింగ్ చేస్తూ కనిపించింది. దగ్గరకు వెళ్లి “అదేంటి GKK (నేను అలా పిలిచేవాణ్ణి) ఎప్పుడూ రాగింగ్ చేయనని నాకు ప్రామిస్ చేశావుగా. మరి ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు” అని అడిగాను.

 

“All promises need not be kept drk” అని నవ్వేసింది.

 

‘అమ్మ GKK ఇంత గడుసు దానివా’ అన్నాను.

 

మెడిసిన్ పూర్తవగానే US వెళ్లిపోయింది.

 

- డి.ఆర్ కె.
02-08-2020