ఆ ఒక్క ఓటూ నాదే బాబూ!....           (08-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి...16

కాలేజీ కబుర్లు

 

ఆ ఒక్క ఓటూ నాదే బాబూ!

 

కాలేజీలో కళాధర్, మిత్ర, జగన్ ల శిష్యరికంలో GVS మూర్తి, హాషిం, సాంబిరెడ్డి, ప్రసన్న , రవీంద్రలతో పాటు నేను కూడా విద్యార్ధి ఉద్యమంలో పనిచేసే వాణ్ణి.

 

కాలేజీ ఎలక్షన్లలో ఒకసారి నన్ను ‘క్యాంటీన్ సెక్రటరీ’ గా పోటీ చెయ్యమన్నారు. జీవితంలో ఎప్పుడూ ఎలక్షన్లలో పోటీ చెయ్యకూడదు అని అంతకు ముందే నిర్ణయం తీసుకున్నాను. అదే విషయం చెప్పినా మెజారిటీ నిర్ణయం శిరసావహించాల్సిందే అని ఒప్పించారు.

 

జనరల్ సెక్రటరీగా BSR మూర్తి, క్యాంటీన్ సెక్రటరీ గా నేను పోటీ చేశాము. నాగార్జునరెడ్డి, గోపీచంద్, అప్పటి క్యాంటీన్ సెక్రటరీ మోహన్ కిషోర్ వారి మిత్రబృందమంతా మాకు గట్టిగా కాన్వాస్ చేశారు.

 

అంతకుముందు సంవత్సరం జనరల్ సెక్రటరీగా GVS మూర్తి సమర్థవంతంగా పనిచేయడం మాకు ప్లస్. మాకు ఎప్పుడూ ఓట్లు వేసే కొంతమంది ఆ సంవత్సరం మమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం మైనస్. ప్రత్యర్ధి కూడా మిత్రుడే!

 

పోటీ తీవ్రంగా ఉంది.

 

ఎలక్షన్ రోజు మధ్యాహ్నం నుండీ ఎవరెవరు ఇంకా ఓటు వెయ్యలేదో గమనించి, వాళ్లల్లో మా ఓటర్లెవరో వడబోసి వాళ్ల ఇళ్లకు వెళ్లి తీసుకువచ్చి ఓటు వేయించాము. ఇది మామూలుగా ప్రతి సంవత్సరం మేము చేసే పనే.

 

సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ పూర్తయింది.

 

Tug of war.

 

ఫలితాలు ఎటయినా అవ్వవచ్చు.

 

రాత్రి ఎనిమిదన్నరకు BSR మూర్తి 17 ఓట్లతో గెలిచాడని ప్రకటించారు. ఆనందోత్సాహాలు మొదలయ్యాయి.

ఆ తర్వాత నా ఫలితం కోసం ఎదురు చూస్తున్నాం. *ఒక్క ఓటుతో గెలిచానని చెప్పారు.* అయితే ప్రత్యర్ధులు రీ కౌంటింగ్ కు పెట్టారు.

 

ఒక్క ఓటే గదా మెజారిటీ!

 

రీ కౌంటింగ్ లో ఏమైనా జరగవచ్చు.

 

మళ్ళీ మా శిబిరంలో టెన్షన్.

 

మరో గంటన్నర తర్వాత ఫలితం ప్రకటించారు.

 

రెండు ఓట్ల మెజారిటీ తో గెలిచాను.

 

సందడే సందడి.

 

అయితే ఆ మర్నాటి నుండీ నాది విచిత్రమైన పరిస్థితి.

 

ఎవరెవరో వచ్చి ‘డిఆర్కే ఆ ఒక్క ఓటు నాదే’ అని ఉత్సాహంగా చెప్పేవారు.

 

తమ వలన ఈ గెలుపు వచ్చిందనే విషయం వాళ్ళందరికీ గొప్పగాను, సంతోషంగానూ ఉండేది. సహజం కదా!

 

‘థాంక్స్ అయ్యా! సంతోషం మీరు ఓటు వేసినందుకు’ అని చెబ్తుండేవాణ్ణి.

 

‘డిఆర్కే’. అని దూరం నుండీ పెద్దగా అరుచుకుంటూ వచ్చి ‘నిన్న నేను ఊరెళ్ళాల్సింది. కానీ నీ కోసం వెళ్లకుండా ఉండి ఓటు వేశాను. నేను వెయ్యకపోతే ఏమైపోయేవాడివి’ అని ఉత్సాహంగా చేయిపట్టుకు పిసికేశాడు ఒకాయన.

 

ఆఖరి గంటలో ఓటు వేసినవారు, పెద్దగా పరిచయం లేకపోయినా మీకే ఓటు వేశానని చెప్పేవాళ్లు - ఇలా ఓ 20 రోజులు గడిచాయి.

 

హాస్పిటల్ ల్ కు వెళ్లినా, కాలేజీకి వచ్చినా ఇదే వరస. అందరూ నన్ను చూడగానే excite అయ్యేవారు. ఆ ఓటు తమదేనని! తాను వెయ్యకపోతే ఓడిపోయేవాడు కదా అనేభావం వాళ్ల కళ్లల్లో కనిపిస్తూ ఉండేది.

 

సీనియర్లు కనపడినప్పుడు కాలేజీలో చేరిన ఫ్రెషర్ లా అయ్యింది నా పరిస్థితి.

 

షేక్ హ్యాండ్ ఇచ్చి ఇచ్చి’ కుడి చెయ్యి’, నవ్వి నవ్వి ‘బుగ్గలు’ నొప్పి పుట్టేయి.

 

20 రోజులు ఉగ్గ బిట్టుకున్నాను. అప్పట్నుంచీ ఎవరన్నా ‘ఆ ఒక్క ఓటు నాదే’ అనగానే
‘లేదు బాస్! ఆ ఓటు నాదే! లేకుంటే గెలిచేవాణ్ణి కాదు గదా!’ అని గట్టిగా చెప్పి నవ్వేవాణ్ణి.

 

అప్పట్నుంచీ ‘ఈ ఒక్క ఓటు గొడవ’ తగ్గుముఖం పట్టింది.

 

కొసమెరుపు :

 

కానీ మా ఆవిడ మాత్రం ఇప్పటికీ ఆ ఓటు తనదే అంటుంటుంది 😆

 

డి.ఆర్.కె.
08.08.2020