ఉషక్కకు నేను రాసిన ఆఖరి లేఖ....           (23-Jul-2022)


గుర్తుకొస్తున్నాయి...52

ఎందరో 'ఉషక్క' అని పిలుచుకునే డాక్టర్ మోటూరి ఉష గారి నాలుగవ వర్ధంతి నేడు

---

ఉషక్కకు నేను రాసిన ఆఖరి లేఖ

...

అక్కా ఉషక్కా,

          నేను క్షేమంగానే ఉన్నాను. నువ్వు క్షేమంగా కాదు గదా అసలు ఈ భూమి మీదే లేవని తెలిసి కూడా ఈ ఆఖరి ఉత్తరం రాస్తున్నాను.

          రమాదేవి, స్వరూపరాణి గార్లు కా.ఉష గారి గురించి రాయమన్నప్పుడు ఎన్నని రాయగలం ఉషక్క జ్ఞాపకాలు అని అనిపించింది. అయినా నీకీ ఉత్తరం రాయాలనిపించి రాస్తున్నాను. ఎందుకంటే నువ్వు రాసిన ఉత్తరాలు నా దగ్గర ఇంకా ఉన్నాయి.

          1980 లో విజయవాడలోని మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే తలుపుతీశావు. అదే మొదటిసారి చూడడం. మొట్టమొదటి సారి నిన్ను చూసిన రోజు నాకు ఇప్పటికీ గుర్తే! అయినా ఎప్పటినుంచో పరిచయం ఉన్నవారిలాగా మాట్లాడటం మొదలు పెట్టాను. సుధాకర్ కూడా అప్పుడే పరిచయం. మిత్రా మాకు ఉషక్క గురించి కొన్ని సంవత్సరాల ముందు నుండే చెప్పడం వల్ల బాగా పరిచయం ఉన్న భావనే నాకు ఉండేది.

మీ ఆసుపత్రిలో 3 నెలలు Observer గా ఉండాలనే నా కోర్కెను వ్యక్తపరిస్తే డా.భాస్కరరావు గారితో కూడా మాట్లాడి చెబుతానన్నారు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకునే కమ్యూనిస్ట్ క్రమశిక్షణ ఎవరికైనా నచ్చుతుందికదా! ఆ మర్నాడు మీ ముగ్గురు మాట్లాడుకుని నన్ను రమ్మన్న తర్వాత మూడు నెలలు మీ ఆసుపత్రిలోనే పనిచేశాను. నా జీవితంలో అదొక కీలకమైన ఘట్టం. పగలు ఆసుపత్రిలోనూ, రాత్రి మీ ఇంట్లోనూ ఉండేవాడిని.

          బాజీ, బుజ్జీ లతో పాటు నాకు కూడా కధలు, Inspiring Incidents, రష్యన్ విప్లవ కబుర్లు చెబ్తుండే దానివి. నాకు పాలు ఇష్టమని ఉదయాన్నే అరలీటరు పాల ప్యాకెట్టు నాకే ఇచ్చేదానివి. నాకంటే 9 సం. పెద్దవారైనా మీ ఇద్దర్ని ఏకవచనంతో పిలవడాన్ని మా అమ్మ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయం మీకు చెప్తే మీరిద్దరూ నవ్వేశారు. ఆ తరువాత నేనెప్పుడు మీ ఇద్దర్ని మీరు, అండివంటి బహువచన పదాలను వాడలేదు.

          Final year పరీక్షలు రాయడానికి మిమ్మల్ని వదిలి గుంటూరు వెళ్లిపోతునప్పుడు నాకు కలిగిన బాధను నీకొక ఉత్తరంలో రాశాను గదా! అప్పుడు నువ్వు బదులు రాసిన ఉత్తరంలో ఒక కవి రాసిన ఈ మాటలను ఉదహరించావు.

ఏటిలోని కెరటాలూ ఏరు విడిచిపోవు

ఎదలోపలి మమకారం ఎక్కడికీపోదు

ఊరువిడిచి వాడవిడిచి ఎంతదూరమేగినా

అయినవాళ్ళు ఎప్పుడూ

అంతరానే ఉందురోయ్

అంతరానే ఉందురోయ్.

          హౌస్ సర్జన్సీ లో నిన్ను, డా. సుధాకర్ ను, డా. భాస్కరరావు గారిని తరచూ కలుస్తూ ఉండేవాడిని. ఇంటికి వచ్చిన పిల్లలందరినీ బాగా చదువుతున్నారా? 1st ర్యాంకు తెచ్చుకోవాలి. డాక్టర్ అవ్వాలి అని చేబ్తుండేదానివి. నవీన్, ప్రవీణ్ లు 10 వ తరగతి వచ్చిన తర్వాత వారి చదువు మీదే నీ దృష్టి ఉండేది. వారిద్దరూ డాక్టర్లు కావాలన్న కాంక్ష నీకు బలంగా ఉండేది. వారిద్దరికీ MBBS సీట్లు వచ్చేవరకు నీ సమయాన్ని వృధా చేయకూడదు అనుకుని ఆ నాలుగేళ్ళు సుధాకర్ తోనే ఎక్కువగా సమయం గడుపుతుండే వాడిని.

          సుధాకర్ నమ్రత, విపరీతంగా చదివే అలవాటు, ఆపరేషన్లు బాగా చెయ్యడం, స్నేహానికి ప్రాణం ఇవ్వడం, సానుకూల దృక్పధం, అస్సలు నెగెటివ్ గా ఆలోచించకపోవడం నన్ను సుధాకర్ కు అభిమానిగా మార్చేశాయి. నిజమైన మిత్రుడంటే సుధాకరే!

          డాక్టరు అయిన తరువాత నేను మీదగ్గరే ఒక సంవత్సరం పనిచేద్దాం అని అనుకుంటే డా.రంగారావుగారి దగ్గర పనిచెయ్యమని, అక్కడ ఇంకా సర్జరీలో మంచి అనుభవం వస్తుందని నన్ను ప్రోత్సహించేదానివి.

ఇంట్లోవారికే కాదు ఇంటికి వచ్చిన అందరికీ ఎంతో రుచికరమైన నీ వంటనే కాకుండా, అప్పటికప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు, శ్రీ రామా స్వీట్స్ తెప్పించి పెట్టేదానివి. ఏ సమయంలో వచ్చినా నీ భోజనం తినొచ్చు అనే ధైర్యం నీ మిత్రులందరికి ఉండేది. విజయవాడలోని ఒకతరం డాక్టర్లందరూ నీ చేతి వంట తిన్నవారే అనడం అతిశయోక్తి కాదేమో!

          ‘పీకల దాకా తినడంఅంటే నీ ద్వారానే అర్ధం అయ్యింది. ఎదుటివాళ్లు అలా తినకపోతే నీకు కడుపునిండేదికాదు. అవసరానికి మించి చాలా ఎక్కువగా వండడం, ఇంట్లో వారు, అతిధులు తిన్న తర్వాత ఆసుపత్రి సిబ్బందికి, ఆ తరువాత రోడ్డుపై ఉన్న రిక్షా వారిని పిలిచి పెట్టడం నీకు హాబీ! ఎవరైన ఏ వస్తువైనా ఇష్టపడితే అది వెంటనే ఇచ్చేసేదానివి. అది ఎంత ఖరీదైన వస్తువైనా, అప్పుడే పరిచయం అయిన వారికైనా...

          స్త్రీలకు సహజంగా ఉండే ఆసక్తులైన చీరలు, బంగారం అంటే నీకు అస్సలు కోరిక ఉండేది కాదు. నాకు కూడా వాటి గురించి ఎక్కువగా మాట్లాడే వారితో మాట్లాడటం ఇష్టం ఉండేది కాదు. బోసి మెడ కూడా అందమేనని నువ్వు నిరూపిస్తున్నావు అనుకునేవాడ్ని. జీవితాంతం చిన్నం బంగారంకూడా కొనుక్కోని స్త్రీ నాకు తెలిసిన వాళ్ళలో నువ్వొక్కదానివే!

          సుందరయ్య గారు చనిపోయినప్పుడు లక్షలాదిమంది విజయవాడ విచ్చేశారు. ఆరోజే మార్క్సిస్ట్ పార్టీ వారు విజయవాడలో బంద్ చేయించారు. బంద్ వలన హోటల్స్ అన్నీ మూసేశారు. దూరం నుండి వచ్చిన వారు ఆహారానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ అసమయంలో ఎంతోమంది స్నేహితులు మీ ఇంటికి వచ్చారు. వారందరికీ వండి వార్చడం నాకు బాగా గుర్తు. ఉషక్క నిజంగా అన్నపూర్ణే కదా !

          అక్కా! నువ్వు చూడని విషయం నేను చెబుతా విను. నువ్వు అకాల మరణం పాలైనప్పుడు ఎంతమంది చూడటానికి వచ్చారో నీకు తెలియదు. నీ కోడలు దేవివచ్చినవాళ్ళందరికీ ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది. మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీఎంతో బాధ్యతగా మరణానంతర కార్యక్రమాన్ని నిర్వహించింది.

          అంతిమయాత్ర జరిగినప్పుడు వాతావరణం ఎంతో వేడిగా ఉన్నా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, మిత్రులు అందరూ ప్రదర్శనగా స్వర్గపురికి తరలారు. ప్రజానాట్యమండలి కళాకారులు పాటలు పాడారు. ఎప్పుడూ నిండుకుండలాగా ఉండే నీ సహచరుడు సుధాకర్కళ్ల నీళ్లు పర్యంతం అవడం మేం చూడలేకపోయాం.

అక్కా, అనుకోకుండా కనీసం ఓ పదేళ్ళ ముందు సుధాకర్, బుజ్జి, బాజీ, దేవి, నిని, నిరల్య, మిత్రులు, పార్టీ వారిని ఇంకా ఎంతో మందిని విడిచి వెళ్లిపోయావు.

          రెండు నిమిషాలు ప్రసంగించినా చప్పట్లు కొట్టించుకునే శక్తి గల నీ ప్రియమైన తమ్ముడు మిత్రనీవు చనిపోయిన రోజు గాని, నీ స్మారక సమావేశంలో గాని రెండు నిమిషాలు కూడా మాట్లాడలేకపోయాడు. నీ భౌతిక కాయాన్ని చూసి కళ్ల నీళ్ళ పర్యంతం అయిన Ch.K.V. ప్రసాదు గారు తొందరగా నీ బాటనే నడవాల్సి వచ్చింది.

ముందో వెనుకో అందరం భూమిలో కలిసి పోవాల్సిన వాళ్ళమే. స్వర్గంలోనో, నరకంలోనో, మరో జన్మలోనో కలుసుకుంటాం అనే నమ్మకాలు మనకెవ్వరికి లేవు.

ఉన్నంత కాలం

మనలాగా మనం బ్రతకడం’,

నలుగురికి సాయం చేయడం’,

మరింత మెరుగైన సమాజం కోసం ప్రయత్నించడంమాత్రమే మనకి తెలుసు.

          ఆ పనిని నీవు నూటికి నూరు శాతం నెరవేర్చినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. తొందరగా వెళ్లిపోయినందుకు బాధగా ఉంది.

మరొక్కసారి నీవు రాసిన మాటలు గుర్తు చేసుకుంటాను.

ఏటిలోని కెరటాలూ ఏరు విడిచిపోవు

ఎదలోపలి మమకారం ఎక్కడికీపోదు

ఊరువిడిచి వాడవిడిచి ఎంతదూరమేగినా

అయినవాళ్ళు ఎప్పుడూ

అంతరానే ఉందురోయ్

అంతరానే ఉందురోయ్.

బై అక్కా,

నీ తమ్ముడు

- ప్రసాదు

17/09/2018