మా కాలేజీలో నా రికార్డు ఇప్పటికీ పదిలమే!....           (27-Aug-2023)


 గుర్తుకొస్తున్నాయి...54

కాలేజీ కబుర్లు

మా కాలేజీలో నా రికార్డు ఇప్పటికీ పదిలమే!

          రికార్డులు సాధించే ఘనత అందరికీ ఉండదు. ఎంతో శ్రమ, మరింత అదృష్టం కూడా ఉండాలి. రికార్డులు కొన్ని విచిత్రమైనవి కూడా ఉంటాయి. నాకున్న రికార్డు అటువంటిదే!

          మాకు ప్రీ ఫైనల్ ఇయర్ చివర్లో SPM, ENT & Ophthalmology (చెవి, ముక్కు, గొంతు, కన్ను - ఇవన్నీ కలిపి ఒకే సబ్జక్ట్) సబ్జక్టులకు పరీక్షలుండేవి. అవి పాస్ అయినా కాకపోయినా ఆఖరి సంవత్సరంలోకి వెళ్తాము. ఆఖరి సంవత్సరం చివర్లో మెడిసిన్, సర్జరీ, గైనకాలజి మూడు పరీక్షలు రాయాలి. అవి పాసైతే హౌస్ సర్జన్సీలోకి వెళ్ళడమే. వీటిల్లో ఒక్క సబ్జక్టు మిగిలినా 6 నెలలు వెనుకపడిపోయినట్లే! రిఫర్డ్ బాచ్లో పడతాము. (తప్పిన వాళ్ళందర్నీ రిఫర్డ్స్ అంటారు) ఆ తర్వాత ఆర్నెల్లకు గానీ పరీక్షలు ఉండవు.

          ప్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలయిన SPM, ENT & Ophthalmology లు అందరితో పాటు రాశాను. SPM సబ్జక్టు పాసయ్యాను కానీ ENT & Ophthalmology సబ్జెక్టులో తప్పాను. అయినా ఫైనల్ ఇయర్లో మొదటి 6 నెలల తర్వాత ఈ పరీక్ష రాసుకోవచ్చు. Time waste కాదు. Medicine, Surgery, Gynaec సబ్జక్టులు సంవత్సరం తర్వాత కదా రాసేది.

          ఈసారి చాలా బాగా చదివాను. కానీ మళ్ళీ తప్పాను. ఎందుకు తప్పానో అర్ధం కాలేదు. ‘Ophthalmology Professor నిన్ను వేసేశాడు బాస్అన్నారు కొంతమంది మిత్రులు.

కానీ ఆ ప్రొఫెసర్ చాలా నిజాయితీపరుడు. రోజూ ఉదయం పూజ చేసుకుని నెత్తి మీద అక్షింతలు చల్లుకుని, తెల్ల బట్టలతో రిక్షా మీద ఆసుపత్రికు వచ్చేవారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తప్పితే ఒక్క రూపాయి కూడా రోగుల దగ్గర తీసుకునేవారు కాదు. ఆయన్ని అనుమానించడం పాపంఅనిపించేది. అందుకే ఆయన నన్ను తప్పించాడన్న వారందరికీ లేదయ్యా ఆయన అలా కావాలని విద్యార్ధులను తప్పించే వ్యక్తి కాదుఅని సమాధానం ఇచ్చేవాడిని. కానీ అంత బాగా చదివినా ఎందుకు ఇలా జరిగిందో నా చిన్ని బుర్రకు అర్ధం కాలేదు.

          ఇక ఆర్నెల్ల తర్వాత Medicine, Surgery, Gynaecology పరీక్షలతో పాటు ENT & Ophthalmology పరీక్షలు కూడా రాయాలి. ఫైనల్ ఇయర్ పరీక్షలు మూడు ఒకేసారి పాసవడమే కష్టం. మళ్ళీ నాకు ఈ నాలుగో సబ్జక్టు ఒకటి. ఆఖరి సంవత్సరం చివర్లో రాసిన పెద్ద సబ్జక్టులు మూడూ పాసైపోయాను. కానీ ENT & Ophthalmology మళ్ళీ తన్నేసింది. ఏం జరుగుతుందో నాకర్ధం కాలేదు. మెడిసిన్ నాకు కష్టమైన సబ్జక్టు. అది మొదటిసారే పాసయ్యాను. కానీ ENT, Ophthalmology – మూడో సారి కూడా పోయింది. నాకే కాదు, మా ఫ్రెండ్స్ కు, కాలేజీలో చాలా మందికి ఇది ఆశ్చర్యంగా ఉంది.

          ఇప్పుడు నాకూ మా ప్రొఫెసర్ గారి మీద అనుమానం వచ్చింది నన్ను ప్రత్యేకంగా తప్పిస్తున్నారేమోనని. కానీ ఎందుకో అర్ధం కాలేదు. ఆయనతో గానీ, మరే ప్రొఫెసర్తో గానీ మాట తీరులోనూ, ప్రవర్తనలోనూ నేనెప్పుడు అగౌరవంగా ప్రవర్తించలేదు.

          ఆ ఒక్క సబ్జక్టు రాయాలంటే మరో ఆర్నెల్లు ఆగాల్సిందే! ఈ ఆర్నెల్ల సమయం వృధానే ! ప్రొఫెసర్ గారి కోపం తగ్గక పోతే? వచ్చేసారి కూడా గట్టెక్కకపోతే? నా పరిస్థితి ఏమిటి? గత పరీక్షలలో ఎప్పుడూ టెన్షన్ పడని నాకు ఇప్పుడు కంగారు మొదలయింది.

          గుంటూరులో నాకు బాగా తెలిసిన ఓ పెద్దాయనతో నా బాధ వెళ్ళబోసుకున్నా. ఆయన వ్యాపారస్దుడు. మంచివాడు. మా కాలేజీ ప్రొఫెసర్లతో మంచి సంబంధాలు ఉండేవి. నేను మాట్లాడతాలే!అని అభయమిచ్చారు. ఆయన వెళ్లి ఏం మాట్లాడారో తెలీదు. పరీక్షలు రాశాను. ఫలితాలు వచ్చేరోజు చెమటలు పట్టేశాయి. ఈసారి కూడా పోతే నా పరిస్థితి ఏమిటి? నేను మొదటిసారి తప్పడం ఫరవాలేదు. రెండోసారి, మూడోసారి చాలా బాగా చదివినా తప్పాను. ఆ చిన్న సబ్జక్టు రాయడం ఇది నాలుగో సారి.

          మొత్తానికి మంచి కబురే వచ్చింది. పాసయ్యాను. హమ్మయ్య మెడికల్ కాలేజీలో ఏ సబ్జక్టు పాసవడానికీ ఇంత కష్టపడలేదు. ఒక చిన్న సబ్జక్టు నా ప్రాణం తీసేసింది.

          పెద్దాయన దగ్గరకు వెళ్లి పాసయ్యానుఅని చెప్పాను.

          ‘పద! ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్దాం. ఆయన ఏం అన్నా నువ్వేమీ మాట్లాడవద్దుఅని చెప్పి వారింటికి తీసుకువెళ్ళారు.

          వెళ్లాం. నన్నేమీ మాట్లాడవద్దు అన్నారు గదా! నమస్కారం పెట్టి కూర్చున్నాను. నన్ను పాస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు పెద్దాయన.

          నా వైపు చూస్తూ ఇక నుంచైనా బాగా ప్రవర్తించుఅని కరుకుగా చెప్పారు ప్రొఫెసర్ గారు.

నేను ఆశ్చర్యపోయాను. అయితే ఆయనకు నా మీద Bad opinion ఉందన్న మాట! ఎందుకు వచ్చి ఉంటుంది!           ఎంత ఆలోచించినా నాకర్ధం కావడం లేదు. సర్, నేనేం తప్పు చేశాను? అని అడగాలనుకున్నాను. కానీ నన్ను తీసుకెళ్ళిన పెద్దాయన ఏమీ మాట్లాడొద్దన్నారని నేనేం అడగలేదు. నమస్కారం పెట్టి వచ్చేశాను.

          ENT & Ophthalmology సబ్జక్టులు మూడు సార్లు తప్పడమే కాకుండా ఫైనల్ ఇయర్ అన్ని సబ్జక్టులు పాసయ్యి Single ENT & Ophthalmology referred గా ఉండి ఆర్నెల్లు పోగొట్టుకున్న ఘనత నాదే! ఇప్పటికీ గుంటూరు మెడికల్ కాలేజీలో నా ఈ రికార్డు ఎవరూ break చేయలేదనే అనుకుంటా! నాది ఎవ్వరూ చెరపలేని రికార్డు కదా 😀

- ఆ ప్రొఫెసర్ గారికి అకారణంగా ఎందుకు నా మీద కోపం వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే?

చవితి చంద్రుణ్ణి చూశావేమోనయ్యా, నీలాపనిందలు వచ్చాయిఅన్నాడు ఒక మిత్రుడు.

కొసమెరుపు :

- మెడిసిన్ సబ్జెక్ట్ ను ప్రొఫెసర్లంత గొప్పగా పాఠాలు చెప్పే మా క్లాస్మేట్ TB రామకృష్ణ ఆ సబ్జక్ట్ లో ఎందుకు తప్పాడో,

నేను మెడిసిన్ సబ్జక్ట్ లో మొదటి సారే ఎలా పాసయ్యానో ఇప్పటికీ అంతుపట్టడం లేదు🤔

- డి.ఆర్.కె.ప్రసాదు

   27.08.2023