ఎట్టకేలకు తీరిన బాకీ....           (04-Nov-2023)


 ఎట్టకేలకు తీరిన బాకీ

 

‘DRK we are out!’ అని అరిచాడు నా ఫ్రెండ్ సూర్యప్రకాష్.

 

మరో పది సెకన్లలో మా స్కూటర్ కాలువ పిట్ట గోడకు బలంగా గుద్దుకుని ఎగిరి సగం నీళ్ళలో, సగం ఒడ్డున పడ్డాం. ఈ స్కూటర్ ఆక్సిడెంట్ కేరళలోని పాల్ఘాట్ పట్టణం దగ్గర గల చుంగమన్నం అనే గ్రామంలో జరిగింది.

 

చచ్చిపోతాం అని తీర్మానించుకున్న నాకు బ్రతికి ఉండడం సంతోషాన్నిచ్చింది. చాలా ఫ్రాక్చర్లు అయి ఉంటాయనుకున్న నేను లేచి నిలబడి ప్రకాష్ దగ్గరకు వెళ్ళగలిగాను. అతని ముఖంలో బాధ కన్పిస్తోంది. లేవలేకపోతున్నాడు. మోకాలు నొప్పిగా ఉందని చెప్తున్నాడు. ఇంతలోనే బిలబిలమంటూ వచ్చేశారు చుట్టు ప్రక్కల ప్రజలు. ప్రకాష్ కాలు నొప్పిగా ఉందని మర్దనా చేయడం మొదలుపెట్టారు. అలా మర్దనా చేయకూడదని చెప్పడానికి నాకు మలయాళం రాదు వారికి తెలుగు రాదు. ఎలాగో అలాగు ఇతను డాక్టరు అని, పాల్ఘాట్ లోని డా. క్రిష్ణన్స్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాడని చెప్పాను. వెంటనే ఆ మర్దనా ఆపేశారు. చెల్లా చెదురుగా పడిపోయిన నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటిని ఏరి జాగ్రత్తగా నాకు అప్పగించారు. వెంటనే ఒక టాక్సీని తీసుకువచ్చి నలుగురు కారులో మమ్మల్ని ఎక్కించుకుని డా. క్రిష్ణన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

 

నాకు చిన్న చిన్న దెబ్బలే కానీ ప్రకాష్ కు ఒక మోకాలి చిప్ప ముక్కలయింది. ఈ విషయం తెలిసి బాధపడ్డారు. వారు వెళ్లిపోయేముందు టాక్సీకి డబ్బులు ఇవ్వబోతే ససేమిరా అంటూ తిరస్కరించారు. జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు.

 

మర్నాడు స్కూటర్ తెచ్చుకోవడానికి వెళ్తే మళ్ళీ ‘టీ’ ఇచ్చి మర్యాద చేశారు. కృతజ్ఞతలు ఎలా చెప్పాలో వారి భాష తెలియక భోరున ఏడ్చి నమస్కారం పెట్టి వచ్చాను.

 

ప్రకాష్ తమ్ముడు మోహన్ గుంటూరు నుండి వచ్చి తనను తీసుకువెళ్లాడు.

 

*****

 

ఇది 1982 జనవరిలో జరిగిన సంఘటన.

 

ప్రకాష్ పాల్ఘాట్ లోని డా. క్రిష్ణన్స్ హాస్పిటల్ లో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. నేను కూడా ఆ ప్రాంతంలో ఉద్యోగం చేద్దామని వెళ్ళాను. నా ఉద్యోగ ప్రయత్నంలో భాగంగానే మేమిద్దరం స్కూటర్ పై ఒక ఊరు వెళ్తున్నప్పుడు దారిలో ‘చుంగమన్నం’ అనే ఊరి వద్ద జరిగిన సంఘటన ఇది. ఆ ఊరి ప్రజలు మాకు చేసిన సహాయానికి ‘చుంగమన్నం’ గ్రామ ప్రజలకు ‘బాకీ’ పడిపోయాం అని మా ఇద్దరికీ అనిపించేది. ఎప్పటికైనా ఆ ఊరికి వెళ్ళి వారందర్నీ కలిసి, వారు చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పాలని మా ఆకాంక్ష.

 

1983 లో నేను, పద్మ పెళ్లి చేసుకున్నాము. హనీమూన్ కు ఊటీ, పాల్ఘాట్ లు వెళ్ళాం.

డా. క్రిష్ణన్స్ హాస్పిటల్ ముందు ఫోటో దిగాను. ఆ హాస్పిటల్ అప్పటికే మూతబడింది.

 

ఆ తరువాత మేము మా వృత్తి భవితవ్యంలో మునిగిపోయాం. ప్రకాష్ మోకాలుకి ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న తర్వాత కొంతకాలం కొచ్చిన్ లో పనిచేశాడు. ఆ సమయంలోనే “గీత” అనే మలయాళీని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమెరికాలోనూ, ఢిల్లీ లోనూ, హైదరాబాద్ లోనూ పనిచేసి 5 సంవత్సరాల క్రితమే విజయవాడకు వచ్చి స్థిర పడ్డాడు.

 

అప్పటి నుండీ మేమిద్దరం ‘చుంగమన్నం’ వెళ్ళి ఆ గ్రామస్థులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటూనే ఉన్నాం. మధ్యలో కరోనా వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సంవత్సరం ఇద్దరం తప్పక వెళ్లాలని నిర్ణయించుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు నాలుగు నెలల క్రితం స్కూటర్ నడుపుతున్న మా సూర్య ప్రకాష్ ను ఒక కారు వేగంగా గుద్దడం వలన అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన నేనన్నా తొందరగా వెళ్ళి ‘బాకీ’ తీర్చుకోవాలని గట్టిగా తీర్మానించుకున్నాను.

 

కానీ ఎవరిని సంప్రదించాలి? ఆ ఊర్లో మాకు ఎవ్వరూ తెలియదు. ఊరి ప్రెసిడెంట్ కు ఉత్తరం రాద్దాం అనుకుని గూగుల్ చేశాం. చుంగమన్నం అనే ఊరు “మాతూర్” అనే గ్రామ పంచాయితీలో ఉందని మాత్రం అర్ధమయింది.

 

మాకు1982 లో మీ ఊరి వద్ద ఒక స్కూటర్ ప్రమాదం జరిగింది. ఆరోజు మీ గ్రామస్థులు మాకు ఎంతో సహాయం చేశారు. మీ గ్రామస్థులకు ధన్యవాదాలు చెప్పడానికి అక్టోబర్ 21 వ తేదీ రావాలనుకుంటున్నాము. ఆరోజు మీరు, మీ పంచాయితీ మెంబర్లు, ఊరి పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం” అని ఆ ఊరి సర్పంచ్ కు ఒక రిజిస్టర్డ్ ఉత్తరం రాశాము.

 

కేరళలో 40 సం. నుండి గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్న మిత్రుడు డా. సుధాకర్ ఇంగ్లీషులో రాసిన ఆ ఉత్తరాన్ని మలయాళంలోకి తర్జుమా చేయించాడు. ఒక నెల ముందే ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేశాము. కాకపోతే ఒక శంక! వారిని కలుసుకోవడానికి నేను చాలా ఉద్వేగంగా ఉన్నాను కానీ వారికి ఇదంతా చిత్రంగా – చాదస్తంగా అనిపించి చెత్త బుట్టలో పారేస్తారేమోనని. ఒక వేళ సమాధానం రాకపోయినా ఆ రోజు ఆ ఊరు వెళ్ళి ప్రమాద స్థలిని చూసి వద్దాం అనుకొన్నాం.

 

ఓ రోజు ‘మాతూర్’ గ్రామ పంచాయితీ నుండి ఉత్తరం వచ్చింది. ‘అప్పటి సంఘటన మాకు తెలియదు. అప్పటి మనుషులు ఇప్పుడు ఉండకపోవచ్చు. మీరు తప్పకుండా మా ఊరు రండి’ అని ఆ ఉత్తరం సారాంశం. సంప్రదించవలసిన నెంబర్లు ఇచ్చారు. ఎగిరి గంతేసినంత సంతోషం వచ్చింది ఆ ఉత్తరం చదవగానే!

 

మా ఆక్సిడెంట్ జరిగిన రోజు విషయమంతా మరింత వివరంగా రాశాను. చల్లపల్లిలో పనిచేస్తున్న ‘అంబిలి’ అనే కేరళ టీచర్ తో మలయాళం లోకి తర్జుమా చేయించాను. మలయాళం టైప్ చేసే వాళ్ళు దొరక్క, అంబిలి దస్తూరి గుండ్రంగా ఉండడంతో ఆ రైటప్ ని స్కాన్ చేయించి ప్రింట్ చేసి తీసుకువెళ్ళాను. దాని స్కాన్డు కాపీని రెండు రోజుల ముందే వారికి వాట్సప్ లో పంపాను.

 

అక్టోబరు 20 వ తేదీ పాల్ఘాట్ సమీపంలోని హోటల్ లో బస చేశాం. ఆ మర్నాడు ఉదయం క్రిష్ణన్స్ హాస్పిటల్ ఉన్న ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళాం. గుర్తు పట్టేట్లు లేదు ఆ ప్రాంతం. అయితే జిల్లా ఆసుపత్రి ఎదురు గానే ఉండేది క్రిష్ణన్స్ హాస్పిటల్. అదే బండ గుర్తు. ఒక మెడికల్ షాపు అతనికి ఆ హాస్పిటల్ పాత ఫోటో (1983 లో నేను, పద్మ వెళ్ళినప్పుడు తీసినది) చూపిస్తే ‘ఇదా ఎప్పుడో అమ్మేశారు గదా! ఇప్పుడు అందులో ఒక సహకార ఆసుపత్రి (Co – operative Hospital) నడుస్తోంది’ అని చెప్పాడు. అక్కడకి వెళ్ళి చూస్తే పాత బిల్డింగ్ ను రీ మోడల్ చేశారు. అక్కడ ఫోటోలు దిగాము.

 

అక్కడ నుండీ చుంగమన్నం వెళ్లాము. ఆక్సిడెంట్ చోటును తేలికగానే గుర్తు పట్టాను. ఆ వంతెన, మా స్కూటర్ గుద్దిన పిట్ట గోడ వద్ద నుంచొని ఫోటోలు దిగుతుంటే ప్రక్క ఇంటి నుండీ ఒకాయన వచ్చాడు. 41 ఏళ్ల క్రితం ఇక్కడ మాకు ప్రమాదం జరిగింది అన్నానో లేదో ఆ రోజు జరిగిన సంఘటనను పూస గుచ్చినట్లు చెప్పాడు. చాలా ఉద్వేగంగా అనిపించింది. అతని పేరు ‘సిద్ధార్ధన్’ అట. బ్యాంక్ లో పనిచేసేవాడట. ప్రస్తుతం రిటైర్ అయిపోయాడు. ఆరోజు తాను లేడట. తన భార్య అంతా చూసిందని చెప్పాడు కానీ తానే చూసినట్లుగా వర్ణించాడు. మనిషి చాలా సీరియస్ గా ఉన్నాడు. సాయంత్రం 4 గంటలకు పంచాయితీ ఆఫీసులో మీటింగ్ ఉంది రండి అన్నాను నేను ఎంతో సంతోషంగా.

 

నేను రాను’ అని ఖరాకండిగా చెప్పాడు. ఈ వయస్సులో మేం పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగలేం అన్నాడు. మేమేదో ఆ ప్రమాద దర్యాప్తుకి వచ్చాం అనుకుని కంగారుపడుతున్నాడని అప్పటికి అర్ధమయింది. ‘వీళ్ళు దర్యాప్తుకి వచ్చిన వాళ్లు కాదని, ఆరోజు ఆక్సిడెంట్ అయిన ఇద్దర్లో ఒక డాక్టరు ఈయనే’ అని మా డ్రైవర్ ఆయనకు మలయాళంలో అర్ధం అయ్యేట్లు చెబితే అప్పటికి నవ్వు ముఖం పెట్టాడు. ‘మీ భార్యతో మాట్లాడవచ్చా’ అని అడిగాను. కోవిడ్ వచ్చిన తర్వాత ఆవిడకు గుండె జబ్బు వచ్చిందని, చెకప్ కు పాల్ఘాట్ వెళ్ళిందని చెప్పాడు. అప్పటికే మీ ఇల్లు ఇక్కడ ఉందా అని అడిగితే పైన షెడ్డు లేదు గానీ ఇల్లు అయితే అప్పటిదే అని చెప్పాడు. ఆయనతో ఫోటోలు దిగి వెనక్కి వెళ్లిపోయాం.

 

సాయంత్రం 4 గంటలకు పంచాయితీ ఆఫీస్ కి వెళ్ళాలి కానీ 3.40 కే చేరుకున్నాం. మాతూర్ గ్రామ ప్రెసిడెంట్ ‘శ్రీమతి ప్రవీదా మురళీధరన్’. ఆవిడే బయటకు వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఆఫీసు లోపలికి తీసుకువెళ్లారు. అప్పటికే ఉప సర్పంచ్ ప్రసాద్, వార్డు మెంబర్లు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. మేము లోన కూర్చొన్న కాస్సేపటికి ఊరి పెద్దలు ముగ్గురు నలుగురు వచ్చారు.

 

పరిచయాలు అయిన తర్వాత హైదరాబాదు ‘ఆల్మండ్స్ స్వీట్స్’ వారి ‘కాజూ బర్ఫీ’ లను వారికి బహూకరించాము. ‘ఆంధ్రా స్వీట్లు’ అని సంతోషపడ్డారు. నేను రాసి, మలయాళంలో తర్జుమా చేసిన రైటప్ ను ప్రెసిడెంట్ ‘ప్రవిద’ను చదవమని నా భార్య పద్మ అభ్యర్ధించింది. ఆవిడ ఆ ఉత్తరం మొత్తం బిగ్గరగా అందరికీ వినపడేట్లు చదివింది. చదవడం పూర్తవగానే అందరూ చప్పట్లు కొట్టారు.

 

వాళ్ళని చూసి మేమూ, మమ్ముల్ని చూసి వాళ్ళూ ఉద్వేగ భరితులమయ్యాం. ఊరి పెద్దలను పరిచయం చేశారు.

 

1982 లో ప్రమాదం జరిగింది.

 

1983 లో మా ఇద్దరికీ పెళ్లయ్యింది. హనీమూన్ కు ఊటీ, పాల్ఘాట్ వచ్చాం మేం. అప్పుడు మీ ఊరు రాలేకపోయాం’ అని నేనంటే “హనీమూన్ కు ఊటీ, కొడైకెనాల్, మున్నార్ వెళ్తారు కానీ పాల్ఘాట్ వచ్చిన వారిని మిమ్మల్నే చూశాం” అంటూ నవ్వాడు ఒక కుర్రాయన. (పాల్ఘాట్ ఒక పట్టణమే కాని ‘హిల్ రిసార్ట్’ కాదు కదా అని ఆయన ఉద్దేశ్యం) అందరం నవ్వుకున్నాం. ఇలా చాలా సరదాగా కాస్సేపు కబుర్లు చెప్పుకున్నాం.

 

మీ ఊరి అభివృద్ధికి మేం కొంత విరాళం ఇవ్వాలనుకున్నాం అని పద్మ 50 వేల రూపాయలు వారికి ఇచ్చింది. వారంతా చాలా ఆనంద - ఆశ్చర్యచకితులయ్యారు! అందరం కలిసి గ్రూపు ఫోటో దిగాం.

 

మేం కూర్చున్న గది ఆధునికంగా ఉంది. ఆ మాటే అంటే ఇది క్రొత్తగా నిర్మించింది అని, నిన్ననే పాల్ఘాట్ MLA దీన్ని ప్రారంభించారని చెప్పారు. మిగతా ఆఫీస్ కూడా చూడండి అని లోనికి తీసుకువెళ్లారు. ఆఫీసు చాలా బాగుంది. ఒక నోటీసు చూపించి “ఇది దేశంలోనే మొట్టమొదటగా ఈ పంచాయితీ చేసిన తీర్మానం. సర్టిఫికెట్ కోసం వచ్చిన గ్రామస్తులెవ్వరూ ఈ ఆఫీసులో ఎవ్వరినీ సర్ అని గానీ మేడమ్ అని గానీ పిలవనవసరం లేదు. బ్రతిమిలాడుతున్నట్లుగా అప్లికేషన్లు రాయనక్కర లేదు” అని వివరించారు. ఈ విషయం నేను దినపత్రికలలో చదివాను గానీ అది ఈ ఊరిదని తెలియదు.

 

అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్పి తిరిగి ప్రయాణమయ్యాం. మేం కారెక్కిన ఐదు నిమిషాలలో మేం ఇచ్చిన రూ. 50,000 కు కంప్యూటరైజ్డ్ రశీదు QR కోడ్ తో సహా వాట్సప్ చేశారు.

 

గతంలో జరిగిన ఆక్సిడెంట్ కు నా భార్యకు ఏమి సంబంధం లేకపోయినా తాను కూడా నాలాగానే ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. 41 ఏళ్ల క్రితం ఆ ఊరి వారు మాకు చేసిన సహాయానికి చేతులు జోడిస్తూ ధన్యవాదాలు చెప్పి, 50 వేల రూపాయల విరాళాన్ని ఆ గ్రామానికి ఇచ్చి నా ‘బాకీ’ని ఇలా తీర్చుకోగలిగినందుకు తేలికబడిన హృదయంతో తిరిగి వచ్చాం.

 

***

 

ఆ మర్నాడు ఈ సంఘటన మొత్తం స్థానిక దినపత్రికలో ప్రచురింపబడిందని తెలిసింది.

 

ఆఖరి మాట:

 

మానవ విలువలు అంటే..

* శ్రమిస్తూ జీవించడం

* నిజాయితీగా బ్రతకడం

* తన పనులు తాను చేసుకోలేని వారికి మనకు ఉన్నంతలో సహాయం చేయడం

 

- అని ఒక పెద్దాయన నిర్వచించారు.

 

పై లక్షణాలతో పాటు మనకు సహాయం చేసిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం కూడా చాలా అవసరం అని నా భావన.

 

- డి. ఆర్.కె.

04.11.2023.