రామయ్య మాష్టారికో విన్నపం....           (06-Jun-2020)


గౌరవనీయులైన చుక్కా రామయ్య మాష్టారికి,

 

ఉపాధ్యాయ వృత్తిలో అతున్నత ప్రమాణాలతో బోధించడమే కాకుండా, విశ్రాంత జీవితంలో కూడా స్ఫూర్తిదాయకమైన రచనల ద్వారా మీరు నాలాంటి ఎందరికో పాఠశాల విద్యపై శాస్త్రీయ అవగాహన కల్పించారు.

 

ఇంటి నుండీ తొలిసారి బడికి వెళ్ళిన పిల్లవానికి ప్రాథమిక తరగతులు “ఇంటి భాష”లోనే బోధించి ఆ తరువాత ప్రామాణిక తెలుగులో బోధిస్తేనే ఫలితాలు బాగుంటాయని మీరు నిరూపించారు. ఇంటి భాషపై మీరు రాసిన సశాస్త్రీయ వ్యాసాలు చదివిన తర్వాత ఇంటి భాషను ప్రచారం చేసే కార్యకర్తలుగా చాలామంది తయారయ్యారు.

 

మీరు ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించి “తెలంగాణా” రాష్ట్రాన్ని సాధించారు. మరి తెలంగాణా ఉద్యమ ముఖ్య నాయకులైన కె.సి.ఆర్. తెలంగాణలో పాఠశాల విద్య అంతా ఇంగ్లీషులోనే బోధిస్తామని ఎప్పుడోనే ప్రకటించేశారు. ఇది అశాస్త్రీయం. పిల్లల వికాసానికి గొడ్డలిపెట్టు అని తెలిసినా ఇప్పటి వరకూ మీరు దాన్ని ఖండించకపోవడం మాబోంట్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

ఉపాధ్యాయ వృత్తిలో గౌరవనీయులు, తెలంగాణా రధసారథి, అత్యంత పోరాట పటిమ గలిగిన మీరు ఈ విషయంలో మీ గళాన్ని విప్పాలి. ఈ ఇంగ్లీషు మీడియం విద్య నుండి పిల్లల బాల్యాన్ని రక్షించాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంటి భాషను, ఆ తర్వాత ప్రామాణిక తెలుగు భాషను బోధనా భాషగా చేయడం మీ ధర్మం. మీరు ఆ రకంగా రాబోయే తెలంగాణా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, మీ బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తూ…

 

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.
తేది : 16-04-2014